calender_icon.png 6 September, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దండేపల్లి గుండాల రోడ్డుకు నిధులు

06-09-2025 12:00:00 AM

  1. రూ. 25 కోట్లు మంజూరు చేయించిన పీఎస్‌ఆర్...

నెరవేరనున్న ఆదివాసీల దశాబ్దాల కల...

పర్యాటకంగా అభివృద్ధికి అవకాశం...

హర్షం వ్యక్తం చేస్తున్న గుండాల, ఊట్ల వాసులు

మంచిర్యాల, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గుండాలకు ఇప్పటి వరకు కూడా సరైన రవాణ మార్గం లేదు. గతంలో పోలీసులు తిర్యాణి మండల కేంద్రం నుంచి గుండాల వరకు, ఇటు దండేపల్లి మండలం ఊట్ల నుంచి గుట్ట మీదుగా గుండాల వరకు తాత్కాలిక రోడ్డు వేశారు. కానీ ఇవి రవాణాకు అనుకూలంగా లేకపోవడంతో గ్రామస్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వర్షా కాలమైతే కాలి నడక కూడా చాలా కష్టం ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఈ గ్రామానికి ఏ వైపు నుంచి సైతం సరైన రహదారి నిర్మాణం చేపట్టలేకపోయారు. మంచిర్యాల ఎంఎల్‌ఏ ప్రేం సాగర్ రావు రోడ్డు మంజూరు చేయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నెరవేరనున్న ఆదివాసీల దశాబ్దాల కల

గుండాల గ్రామం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నప్పటి వీరికి ఏ అవసరమైనా మంచిర్యాల జిల్లాకే వస్తుంటారు. ఇక్కడి ప్రజలంతా మంచిర్యాల నియోజక వర్గంలోని దండేపల్లి, మ్యాదరిపేట, లక్షెట్టి పేట, మంచిర్యాలకు వైద్యం, నిత్యవసర సరుకులు, ఎరువులు, విత్తనాల కోసం గుట్ట మీద నుంచి కాలి నడకన లేదా ద్విచక్ర వాహనాలు, ఎడ్ల బండ్ల ద్వారా మాత్రమే వస్తుంటారు.

వర్షాలు అధికంగా కురిసిన సమయాల్లో వైద్యం కోసం చిన్న పిల్లలని, రోగులను, గర్భిణీలను మంచంపై మోసుకు వచ్చిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు మంజూరు కావడంతో ఆదివాసీల దశాబ్దాల కల నెరవేరినట్టయింది.

రూ. 25 కోట్లు మంజూరు చేయించిన పీఎస్‌ఆర్

గిరిజన పల్లెలకు అనుసంధానం కోసం బీటీ రోడ్ల నిర్మాణానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నుంచి రాష్ర్ట వ్యాప్తంగా రూ. 465.55 కోట్లు పరిపాలన ఆమోదం లభించింది. మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావు గుండాల గ్రామస్తులు పడుతున్న అవస్థలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించి దండేపల్లి నుంచి గుండాలకు 12 కిలో మీటర్లు బీటీ రోడ్డుకు రూ. 25 కోట్లు మంజూరు చేయించారు.

దీనితో గుండాల గ్రామానికి వెళ్లే దారి మధ్యలో మామిడిపల్లి గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన ఊట్ల గ్రామానికి రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. అంతే కాకుండా పెద్దయ్య దేవుని వద్దకు వెళ్లేందుకు కూడా ఇదే ఏకైక, ప్రధాన మార్గం కావడంతో పెద్దయ్య దేవుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తొలగనున్నాయి. 

పర్యాటకంగా అభివృద్ధికి అవకాశం...

దండేపల్లి నుంచి గుండాలకు రోడ్డు వేయడంతో పర్యాటకంగా అభివృద్ది చెందనుంది. ఈ రహదారి గుండా వెళితే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండాలలోని గుండాల జలపాతం, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఊట్ల జలపాతం (ఊటలు),

పెద్దయ్య ఆలయం, సహ్యాద్రి పర్వతాలు (గుట్టలు), లోయలు, గుహలు లాంటి పర్యాటక ప్రాంతాలతో పాటు ఈ దారి వెంట ఎక్కువగా అడవి ఉండటంతో అడవీ జంతువులు, తీరొక్క పక్షులు ఈ మార్గంలో కనిపించి ఆహ్లాదాన్ని పంచనున్నాయి. అడవి అందాలు పర్యాటకులకు, భక్తులకు కనువిందు చేయనున్నాయి.

ఆదివాసీల కష్టాలు తీర్చేందుకు... 

గుండాల గ్రామ ఆదివాసీల జీవన, ఆర్థిక, సాంప్రదాయ, రవాణా వ్యవస్థలపై నాకు పూర్తి అవగాహన ఉంది. వారు ఏ అవసరానికైనా మంచిర్యాలకే వస్తుంటారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులను చూసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి దండేపల్లి నుంచి గుండాలకు రూ. 25 కోట్ల అంచనాతో  రహదారి పనుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించా. రోడ్డు నిర్మాణంతో గుండాల గ్రామస్తులతో పాటు పెద్దయ్య దేవుని వద్దకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తొలుగుతాయి.

 కొక్కిరాల ప్రేం సాగర్ రావు, ఎంఎల్‌ఏ, మంచిర్యాల