25 March, 2026 | 2:08 AM

విద్యారంగానికి 20శాతం నిధులు కేటాయించాలి

25-03-2026 12:36 AM

టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 24, (విజయక్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలనే ప్రధాన డిమాండ్ తో పాటు ఉపాధ్యాయుల ఇతర ఆరు డిమాండ్ల సాధన కై మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం(ఐడిఓసి)ఎదుట  నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ నిరసన ప్రదర్శననుద్దేశించి టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుగులోత్ హరిలాల్ నాయక్,జోగా రాంబాబు మాట్లాడుతూ! ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కొరకు అధికార పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా,రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టు కనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

పిఆర్సి ఫిట్మెంట్ను వెంటనే ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని,రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాలను ఏక మొత్తంలో ఒకేసారి విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని, 2003 డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, టీచర్ల పెండింగ్ బిల్లులు,పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, విద్యా రంగంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయ వ్యవస్థను రద్దు చేయాలని,వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని,వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని, కేజీబీవీ,మోడల్ స్కూల్స్,గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని సిఆర్టి లకు, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు నగదు రహిత వైద్య సదుపాయాన్ని కల్పించాలని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉపాధ్యాయ వ్యవస్థను రద్దు చేసి వారికి మినిమం టైం స్కేల్ ఇచ్చి,వారికి ఉద్యోగ భద్రత కల్పించి,వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలన్నారు. సిపిఎస్ అనేది ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఒక మహమ్మారిగా మారినందున సిపిఎస్ ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన ప్రదర్శనలో టిపిటిఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి, అకడమిక్ సెల్ కన్వీనర్ ఎం.రామాచారి,రాష్ట్ర కౌన్సిలర్స్ కె.మాధవరెడ్డి, బి.ప్రసాద్ రావు జిల్లా ఉపాధ్యక్షులు పి.గంగరాజు, వి.సరియా, పి కృష్ణయ్య,జిల్లా కార్యదర్శులు జి.భాగ్య రావు, ఎస్.కృష్ణ బాబు, జిల్లా కౌన్సిలర్స్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కురుసం వెంకటేశ్వర్లు, బి.వెంకట్ రామ్, పి.సర్వేశ్వరరావు, బి.రామరాజు, పి.సమ్మయ్య, బి.రవి, సుందర్, రామనాథం, శ్రీనివాస్, చెన్నారావు, పి.సత్యనారాయణ, చింత బుచ్చిరాములు, పాల్గొన్నారు.