16 June, 2026 | 2:35 AM

‘యాప్’ పరేషాన్!

16-06-2026 01:21 AM

రైతులకు శాపంగా ఫెర్టిలైజర్ యాప్

వానకాలం సాగువేళ అన్నదాతల అవస్థ

యాప్ తెరిస్తే ఔట్ ఆఫ్ స్టాక్

యాప్ విధానం రద్దు చేయాలని రైతుల డిమాండ్

బోధన్, జూన్ 15 (విజయక్రాంతి): ‘తాత ముత్తాతల కాలం నుంచి యూరియా బస్తా కావాలంటే సొసైటీకి పోయేటోళ్లం. ఇప్పుడు కొత్త విధానాలు అని చెప్పి యాప్ తెచ్చిండ్రు. ఫోన్లో యాప్ ఓపెన్ చేయాలి. ఓటీపీ కొట్టాలి. స్లాట్ బుక్ చేసుకోవాలి. మళ్లీ ఎక్కడ ఏ ఊర్లో యూరియా ఇస్తారో తెలియదు. ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి.

చదువు దాని మాకు యాప్ తో లేనిపోని నెత్తి నొప్పి అవుతుంది’.. ఇది బోధన్ పట్టణ రైతు శంఖు సాయిలు ఆవేదన. ఇది ఆ ఒక్క రైతు అవేదన మాత్రమే కాదు, నిజామాబాద్ రైతులదరి గోస. కొత్తగా అమలు చేస్తున్న యాప్ విధానంపై రైతులు మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 5లక్షల 50 వేలఎకరాల్లో పంటల సాగు జరుగుతుంది. అయినా, సరిపడా యూరియా మాత్రం జిల్లాకు రాలేదు.

చదువురాని వారికి నరకం

పొలాల్లో నిత్యం కష్టపడే రైతులకు అధునాతన విధానాల పేరుతో లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతున్నారు. ఏదో కోడ్లు పెట్టుకుని సెల్ ఫోన్ లు వాడుతున్న రైతులకు యాప్లు ఎలా ఉపయోగించాలో అర్థం కావడం లేదు. ఎక్కువ మంది రైతులు చదువురాని ఉన్నారు. ఇంట్లో పిల్లలు చదువుల కోసం ఇతర ప్రాంతాలలో ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తెచ్చిన ఫెర్టిలైజర్ యాప్ వారికి ఇబ్బందులు మాత్రమే మిగులుస్తుంది. అటు యూరియా పక్కదారి పెరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. నేటికీ గ్రామాల్లో చిన్న మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడటం రాని రైతులు 50 శాతానికి పైగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో యాప్ విధానం కష్టాలను తెచ్చిపెట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

2 నిమిషాల్లో సర్వర్ క్రాష్

దీనికి తోడు 60 ఏళ్లు దాటిన రైతులు, చదువు రాని వారు స్మార్ట్ఫోన్ లేనివారు యాప్ వాడలేకపోతున్నారు. యాప్లో బుక్ చేసుకున్నా సరుకు రాలేదని డీలర్ చెప్తున్నారు. రోజూ ఉదయం 10 గంటలకు స్లాట్ ఓపెన్ చేస్తే 2 నిమిషాల్లోనే సర్వర్ క్రాష్ అవుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 6 గంటల లోపు మాత్రం తెరిస్తేనే ఎక్కడో ఒకటో రెండో దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. యూరియా బస్తా గరిష్ఠ ధర రూ.266.. కానీ, యాప్ లో అందుబాటులో లేని కారణంగా రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించి రైతులు బ్లాక్లో కొనాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయని వాపోతున్నారు.  యాప్ విధానం రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలనే డిమాండ్ రైతుల నుంచి వ్యక్తం అవుతుంది. 

6 గంటలకే నోస్టాక్

ఉదయం 6 గంటలకే యాప్ ఓపెన్ చేసినా ’స్టాక్ లేదు’ అని చూపిస్తుంది. ఏవో ఆఫీస్కు పోతే యాప్లోనే బుక్ చేసుకో అంటున్నారు. పొలంలో వరి నారు ఎదిగిపోతుంది. యూరియా లేకపోతే పంట చేతికి రాదు. యాప్ తెరిస్తే చాలు ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తుంది. లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. అధికారులు యూరియా కొరత లేకుండా చూడాలి. 

- గంగాగౌడ్, రైతు, సాటాపూర్, రెంజల్

యాప్ రద్దుచేయాలి 

నేను ఒక చిన్న సన్నకారు రైతుని. ౧.10 ఎకరాల భూమి ఉన్నది. ఎకరానికి ఒకటి చొప్పున యూరియా బస్తాలు వస్తాయని చెపితే యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని ప్రయత్నం చేసినా. అయితే అందులో నో స్టాక్ అని చూపిస్తుంది. ఈ విధానం ద్వారా నాలాంటి ఎంతోమంది  ఇబ్బంది పడుతున్నారు. పాత పద్ధతిలో యూరియా సరఫరా చేయాలి. 

- సాయన్న  రైతు, బోధన్