6 August, 2026 | 2:32 AM

విప్లవ చైతన్యదీపిక గద్దర్

06-08-2026 12:00 AM

భారతదేశ సాంస్కృతిక ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి గద్దర్. ప్రజల బానిసత్వం, అణచివేతకు వ్యతిరేకంగా విప్లవ గీతాలతో చైతన్యాన్ని నింపారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రాం తీయ అస్తిత్వానికి బాటలు వేశారు.

తన జీవితమంతా ప్రజల కోసం, జానపద పాటల కోసం అం కితం చేసిన అరుదైన వ్యక్తి గద్దర్. ఆయన మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామం లో 1949లో జనవరి 31న పేద దళిత కుటుంబంలో జన్మించారు. అసలు పేరు విఠల్‌రావు అయినా... గద్దర్‌గానే విస్తృత ప్రాచుర్యం పొందారు. 1990 దశకం భారత బహుజన రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపు. ఒకవైపు సాంప్రదాయ అగ్రకుల రాజకీయాలకు అభిముఖంగా కాన్షీరాం బహుజన రాజ్యాధికార ఉద్యమాన్ని నిర్మిస్తున్న కాలం.

మరోవైపు గద్దర్ తన పాటతో, కళతో, ప్రజా చైతన్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బానిసత్వం, అణచివేతను ప్రశ్నిస్తున్నారు. పీపుల్స్ వార్ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న జననాట్య మం డలి ద్వారా విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గద్దర్‌పై కాల్పులు జరిగినప్పుడు ఆయనను ఆసుపత్రిలో పరామర్శించిన తొలి జాతీయ నాయకుల్లో కాన్షీరాం ఒకరు. ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉండే ది. ఒక సందర్భంలో అనుకోకుండా విమాన ప్రయాణంలో కాన్షీరాం గద్దర్‌ను కలిశారు. ‘బహుజన రాజ్యాధికార పోరాటంలో నాతో కలిసి నడవండి’ అని ఆహ్వానించారు.

అయితే, కాన్షీరాం తాత్వికతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన గద్దర్ ఆయనకు దగ్గర కాలేకపోయారు. చరిత్రలో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక ప్రశ్న వేధిస్తుంది. గద్దర్ వంటి ప్రజాదరణ కలిగిన ఉద్యమకారుడు కాన్షీరాం రాజకీయ ప్రయాణంలో భాగమై ఉంటే, ఉత్తరప్రదేశ్ తర్వాత బహుజన రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ కూడా బలమైన కేంద్రంగా మారేదని రాజకీయ విశ్లేషకుల భావన.

అంతేకాకుండా అగ్రవర్ణాల చేతుల్లో గద్దర్ సమానత్వ సిద్దాంతం ఓడిపోయేది కాదు. ఒకవేళ గెలిస్తే అణచివేయబడిన పేద బడుగు బలహీనవర్గాల కన్నీళ్లకు, కష్టాలకు సమాధానం లభించేది. ఈ చారిత్రక తప్పిదాలే నేటికి బహుజనుల ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. గద్దర్ గోసి, గొంగడితో తెలంగాణ స్వరాష్ట్ర సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ చరిత్రను మలుపు తిప్పారు. అతని చైతన్యాన్ని అగ్రకుల పార్టీలు వాడుకున్నవి కానీ, తన అస్తిత్వాన్ని నిలబెట్టడంలో విఫలమైనవి. గత ప్రభుత్వ హయాంలో ఇదే జరిగింది.

ఓ పార్టీ గద్దర్‌ను నక్సలైట్‌గా, వేర్పాటువాదిగా ముద్రవేసింది. మరి ఇప్పటికీ కొందరు దళిత మేధావులు అంబేద్కర్‌ను పుట్టించాల్సింది బదులు హిడ్మాలను పుట్టిస్తున్నారు. భాష, యాస, సంస్కృతి వంటి ఉపరితల అంశాలకే పరిమితమై దళిత ఉద్యమాలను దారితప్పిస్తున్నారు. గద్దర్ తన చివరి అంకంలో సంఘర్షణకు గురయ్యారు. సత్యాన్ని తెలుసుకుని అంబేద్కర్ మార్గంలో ప్రయాణించారు. ‘పొటిలికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ’ అనే నినాదంతో రాజకీయ పార్టీని పెట్టారు. ఆ పార్టీతో రాజకీయ పోరాటం మొదలుపెట్టే దశలోగా 2023 ఆగస్టు 6న తుది శ్వాస విడిచారు.

ఆయన సంస్మరణ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విముక్తి ఉద్యమ సారథి డాక్టర్ విశారదన్ మహారాజ్ చెప్పిన ‘గద్దర్ మరణించలేదు... ఈ రోజే పుట్టాడు’ అనే మాటలు అక్షర సత్యం. ఎందుకంటే జీవిత చరమాంకంలో ఆయన అంబేద్కర్ మార్గాన్ని స్వీకరించి, బౌద్ధనౌకగా మారి కోట్లాది బహుజనుల ఆత్మకు దగ్గర య్యారు. గద్దర్‌ను ప్రేరణగా తీసుకున్న ఎంతో మంది బహుజనులకు ఆయన జీవితం ఒక పాఠం కావాలి. అగ్రకుల నాయకత్వంలోని ఉద్యమాలు, సంస్థలు బహుజన విముక్తికి మార్గం చూపవు. స్వతంత్ర రాజకీయ శక్తిని నిర్మించి, స్వశక్తి స్వధర్మంతో ముందుకు సాగినప్పుడే అట్టడుగు వర్గాలకు నిజమైన విముక్తి లభిస్తుంది.

వ్యాసకర్త సెల్: 7989579428

సంపతి రమేష్