సహజీవనంలోనూ రక్షణ
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సామాజిక పరిస్థితుల మూలంగా మన దేశంలోనూ గత కొన్నేళ్లుగా సహజీవన సంబంధాలు పెరుగుతున్నాయి. అయితే, ఈ సంఖ్యతోపాటే సహజీవన సంబంధాల్లో ఉన్న మహిళలపై వేధింపులు, ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక, శారీరక హింస పెరుగుతుండటం ఆందోళనకరం.
ఇలాంటి తరుణంలో వివాహ బంధంలోనే కాదు, సహజీవనంలో ఉన్న మహిళలకు కూడా గృహహింస వంటి చట్టపరమైన రక్షణలు ఉంటాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడం ముదావహం. వివాహం కానందున తనపై దాఖలైన గృహహింస కేసును కొట్టివేయాలని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి చేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించడం గమనార్హం. వివాహం జరగలేదన్న ఒకే ఒక్క కారణంతో మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసను విస్మరించడం సరికాదనే భావనను ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యక్తం చేసింది.
మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాలను, వాటి అసలు లక్ష్యానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ తీర్పు మరోసారి నొక్కిచెప్పింది. కాగా, మన దేశంలో ఇప్పటివరకు సహజీవనంలో ఉన్న మహిళలు అనేక సందర్భాల్లో చట్టపరమైన రక్షణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సహజీవనంలో ఉన్న మహిళలకు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంది. వేధింపులకు గురైనప్పుడు, అవమానాలను ఎదుర్కొన్నప్పుడు ఒక మహిళగా న్యాయస్థానాల తలుపు తట్టే హక్కు వారికీ ఉంటుంది.
బంధం పేరు మారినంత మాత్రాన మహిళ హక్కులు మారకూడదు. సమాజం మారుతున్నప్పుడు చట్టం కూడా పరిస్థితులకు అనుగుణంగా తన పరిధిని మార్చుకోవాలి. ఏ బంధంలో ఉన్నప్పటికీ, మహిళలను హింసించే హక్కు ఎవరికీ లేదు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలను కాలానుగుణంగా, మానవీయ కోణంలో అర్థం చేసుకోవాల్సిన తరుణమిది. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం మహిళలందరికీ వర్తిస్తాయి. ఈ ప్రాథమిక సూత్రాన్ని సుప్రీంకోర్టు తన తాజా తీర్పు ద్వారా బలపరిచిందనే చెప్పాలి.
న్యాయస్థానం తాజా తీర్పు ఆ దిశగా వేసిన కీలకమైన అడుగని చెప్పక తప్పదు. అదే సమయంలో వివాహం అనే పేరుకు మాత్రమే రక్షణ పరిమితం కాదనే సత్యాన్ని సమాజం కూడా గుర్తించాలి. మహిళల గౌరవాన్ని కాపాడటం సమాజం బాధ్యత అయితే, ఆమె హక్కులను రక్షించడం చట్టం బాధ్యత. కాగా, బంధంతో సంబంధం లేకుండా అన్యాయం జరిగిన మహిళలకు న్యాయస్థానం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భరోసా కల్పించిన ఈ తీర్పు చరిత్రాత్మకం.






