గమ్యం యాప్ పనిచేయక.. బస్సుల గమ్యం తెలిసేది ఏలా..?
బెజ్జూర్ జూన్ 21 (విజయక్రాంతి): గమ్యం యాప్ పనిచేయకపోవడంతో ఆర్టీసీ బస్సుల గమ్యం తెలవడం లేదని ప్రయాణికులు తెలుపుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా ఆర్టీసీ డిపో నుండి వివిధ మండలాలకు వెళ్లే కొన్ని ఆర్టీసీ బస్సులకు జిపిఎస్ లేకపోవడంతో బస్సుల యొక్క గమ్యం తెలవడం లేదని ప్రయాణికులు తెలుపుతున్నారు.
కొన్ని బస్సులకు జిపిఎస్ ఉండి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ సర్వీసులకు జిపిఎస్ లేకపోవడంతో బస్సుల గమ్యం తెలవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతలమానపల్లి మండలంలోని గూడెం మీదుగా మహారాష్ట్ర లోని అహరి నుండి ఉదయం 8:30 గంటలకు బయలుదేరే ఆర్టీసీ సర్వీస్ ఉదయం 8 గంటలకు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అహిరి నుండి ఉదయం గూడెం మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సు సమయపాలనతో నడిపినట్లయితే గూడెం, కర్జల్లి, చిత్తామా, కేతిని గ్రామాల నుండి చింతలమానపల్లి మండలానికి వచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ ఆర్టీసీ సర్వీసు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు,విద్యార్థులు తెలుపుతున్నారు. ఇట్టి విషయమై ఆసిఫాబాద్ జిల్లా ఆర్టిసి డిపో మేనేజర్ రాజశేఖర్ ను వివరణ కోరగా ఆర్టిసి బస్సు సమయపాలన సరి చేస్తామని, గమ్యం యాప్ అప్డేట్ చేసి ప్రయాణికులకు ఆర్టీసీ సర్వీస్ జిపిఎస్ విధానంతో బస్సుల గమ్యం ప్రయాణికులకు తెలిసేలా చేస్తామని అన్నారు.






