24 July, 2026 | 2:53 AM

గంజాయి ముఠా అరెస్ట్

24-07-2026 12:14 AM
  1. రూ.11.55 లక్షల గంజాయి స్వాధీనం 
  2. ఐదుగురు అరెస్ట్.. ఇద్దరు పరారీ

కల్లూరు,జూలై 23, (విజయక్రాంతి): కల్లూరు పట్టణ శివారులో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ.11.55 లక్షల విలువైన 23.100 కిలోల ఎండు గంజాయి,ఒక ఆటో రిక్షా,రెండు ద్విచక్ర వాహనాలు,ఐదు మొబైల్ ఫోన్లు,రూ.5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసిపి వసుందరా యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కాశ్మీర శివాలయం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటాడి ఐదుగురిని పట్టుకున్నారు.

మరో ఇద్దరు నిందితులు వాహనాలు వదిలి పరారయ్యారు.పట్టుబడిన వారి ఆటోను తనిఖీ చేయగా 12 ప్యాకెట్లలో గంజాయి లభించింది. తహశీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి గంజాయి,వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారు మహమ్మద్ అన్వర్,షేక్ ముజాహిద్ పాషా,మహమ్మద్ వజీర్ ఖాన్,దేవరం రాకేష్, మహమ్మద్ ఆదిల్ కాగా,రాజు, కార్తీక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సీఐ  ముత్తులింగయ్య,ఎస్త్స్ర డి.హరిత, హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు, కానిస్టేబుళ్లు రంగారావు,రఫీ, విజయకాంత్,డ్రైవరు ప్రసాద్ లను ఏసీపి అభినందించారు.