24 July, 2026 | 3:23 AM

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ ఆధ్వర్యంలో నిరసన

24-07-2026 12:13 AM

దామరచర్ల, జూలై 23: లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ల తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దామరచర్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటన వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దు నాయక్ ,స్కైలాబ్ నాయక్ ,బంటు కిరణ్ ,నాగు నాయక్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్ యూఐ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు