23-10-2025 12:00:00 AM
- చెత్త పేరుకుపోయి పందులు, కుక్కలు విహారం
-రోగాలతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ఘట్‌కేసర్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలోని వీధులన్ని పూర్తిగా చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. దోమల బెడద తీవ్రరూపం దాల్చింది. దోమల సమ స్యతో పట్టణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు బయట ఉండ లేని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్యం లోపంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనాలకు దోమల బెడద కంటికి నిద్రలే కుండా చేస్తున్నది. అధికారులు దోమల సమస్యపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి పందులు, కుక్కలు వీధుల్లో విహారం చేస్తున్నాయి. పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో రోగాలతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఘట్ కేసర్ పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని వార్డులలో ప్రజలు తమ ఇష్టానుసారంగా రోడ్ల పక్కనే చెత్తచెదారాన్ని పడి వేయడం, బహిరంగ ప్రదేశాలలో మురుగునీటిని వదిలివేయడం జరుగుతుంది.
దీంతో దోమల వృద్ధి పెరగడంతో పాటు పందులు చెత్తాచెదారం వెంబడి విహారం చేయడంతో ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నదని సమీప నివాసాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధులల్లో చెత్త చెదారం విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ప్రముఖ దినపత్రికలలో కథనాలు వెలువడిన లాభం లేదని స్థానికులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు బహిరంగ ప్రదేశాలలో చెత్తాచెదారం వేయడం, మురుగు నీటిని వదలడం వంటి వారి పై మున్సిపల్ అధికారులు గుర్తించి జరిమానా విధించే చర్యలు తీసుకొని పరిశుభ్రత వైపు అడుగులు వేయాలని ఘట్ కేసర్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పట్టించుకునే నాథుడే లేడు
ఘట్కేసర్ పట్టణ వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయినా పట్టించుకునే నాధుడే నేడు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిశుభ్రత అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్యం పై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
మన్నె రాము, స్థానికుడు
ప్రాణాంతక వ్యాధుల బారిన
పారిశుద్ధ్య లోపంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడాల్సిన దుస్థితి నెలకొంది, వీధులల్లో రోడ్ల పక్కన చెత్తాచెదారం వేసే వారిపై జరిమానాతో చర్యలు తీసుకోవాలి.
కందాడి ఉపేందర్ రెడ్డి, స్థానికుడు