calender_icon.png 23 October, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకా హత్య కేసు.. నేడు నాంపల్లి కోర్టులో విచారణ

23-10-2025 08:58:22 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో(Y.S. Vivekananda Reddy) సీబీఐ దర్యాప్తు కొనసాగించే విషయంపై నేడు విచారణ జరగనుంది. సీబీఐ దర్యాప్తు కొనసాగించే విషయంపై గురువారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally CBI Court) విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ఆదేశంతో నాంపల్లి కోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్ వేశారు. సీబీఐ చేపట్టిన విచారణ కొనసాగించాలని కోరుతూ సునీత పిటిషన్ లో పేర్కొన్నారు. కీలక వ్యక్తులను ప్రశ్నించకుండా, అరెస్టు చేయకుండా విచారణ ముగించారని సునీత ఆరోపించారు. తన తండ్రి మృతిపై తనకు ఫోన్ చేసినవారికి సమాచారం ఇచ్చిందెవరో బయటకు రాలేదని సునీత తెలిపారు. వారికి ఆ సమాచారం ఎక్కడ్నుంచి వచ్చింది, ఎవరిచ్చారో బయటికి రాలేదన్నారు.

తొలుత గుండేపోటు.. తర్వాత హత్య వంటి విషయాలపై లోతైన దర్యాప్తు(CBI investigation) జరగాల్సి ఉందని సునీత డిమాండ్ చేశారు. దర్యాప్తు కొనసాగింపుపై ట్రయల్ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని సునీతకు సుప్రీంకోర్టు సూచించింది. సెప్టెంబర్ 16న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు సీబీఐ కోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు. సునీత పిటిషన్ పై ప్రతివాదులందరికీ నోటీసుల జారీకి సీబీఐ కోర్టు గత వారమే ఆదేశాలిచ్చింది. ఒకరిద్దరికి తప్ప నిందితులైన ప్రతివాదులకు సునీత తరఫు లాయర్లు నోటీసులు అందించారు. ఇద్దరు నిందితుల లాయర్లకు నోటీసులు ఇచ్చేందుకు చాలా ప్రయత్నించామని సునీత లాయర్లు తెలిపారు. ఎంత ప్రయత్నించినా నిందితుల తరుఫు లాయర్లు దొరకట్లేదని సునీత లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇచ్చిన అడ్రస్ లో వారు లేరని, ఫోన్ చేస్తే ఆ నెంబర్లు పనిచేయట్లేదని లాయర్లు వెల్లడించారు. సునీత పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టులో ఇవాళ తొలిసారి వాదనలు జరిగే అవకాశముంది.