26-04-2025 12:00:00 AM
హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతదేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. మారణకాండకు తెగబడిన ఉగ్రమూకలను భద్రతా బలగాలు సాధ్యమైనంత త్వరగా మట్టుబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. దాడి ద్వారా దేశంలో మత ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితులను ఉగ్రవాదులు కోరుకున్నారు. కానీ, ఈ సంక్లిష్ట పరిస్థితిని దాటి దేశ ప్రజలందరూ ఐక్యంగా నిలబడ్డారు.
ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. కశ్మీర్‌లోని పహల్గాంలో ఈనెల 22న భద్రతా దళాల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు 26 మంది పర్యాటకులను పొట్టన బెట్టుకున్నారు. దీన్ని సాధారణ ఉగ్రదాడిగా భావించలేం. సమూహంలోంచి హిందువులను వేరు చేయడంతోపాటు దుస్తులను విప్పదీసి మరీ హిందువులే అని నిర్ధారించుకున్న తర్వాతే ఉగ్రమూక పర్యాటకులపై తూటాల వర్షం కురిపించారు.
భారతదేశంలో మతఘర్షణలు చోటుచేసుకోవాలని ఉగ్రవాదులు భావించినట్టు దీన్నిబట్టి అర్థమవుతోంది. ఇప్పుడిప్పుడే కశ్మీర్ అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి. కశ్మీర్‌ను సందర్శిస్తున్న పర్యాటకుల సంఖ్య పెరగడం ద్వారా అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. పర్యాటక రంగం అభివృద్ధితో కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ఇటువంటి తరుణంలో పర్యాటకులను చంపి, స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలను దూరం చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితులను అడ్డం పెట్టుకుని కొంతమంది యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించాలనేది లష్కరే తోయిబా మరో లక్ష్యంగా కనబడుతోంది.
అయితే, మతం పేరుతో ప్రజలమధ్య చిచ్చు పెడదామనుకున్న ఉగ్రవాదుల పాచికలు పారలేదు. వారు ఊహించిన దానికి భిన్నంగా భారతీయులంతా ఒక్కటయ్యారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారనే కారణంతో మతఘర్షణలకు వెళ్లకుండా హిందువులు సంయమనం పాటిస్తే.. కొవ్వొత్తుల ర్యాలీ, మసీద్‌లలోని లౌడ్ స్పీకర్ల ద్వారా ఉగ్రవాదుల తీరును కశ్మీర్ ముస్లింలు ఖండించారు. అలాగే, పహల్గాం ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి మసీదులలో ప్రార్థనలు చేశారు. దానితోపాటు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. మతం, భాషతో సంబంధం లేకుండా దేశ ప్రజలంతా సమిష్టిగా నిలబడి ఉగ్రవాదుల ఎత్తులను చిత్తు చేశారు.
కశ్మీర్ లోయలో కశ్మీరియత్ అనే భిన్నమైన సంస్కృతి ఉంటుంది. హిం దూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతాల ప్రజలు మత సామరస్యంతో ఉండి, ఒకే సాధారణ సాంస్కృతిక గుర్తింపును కలిగి ఉండటాన్ని కశ్మీరియత్ అం టారు. ఈ సంస్కృతిలో భాగంగా అక్కడి ప్రజలు అతిథులను గౌరవిస్తారు. వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఉగ్రదాడి సందర్భంగా ఈ కశ్మీరియత్ సంస్కృతి గొప్పతనం మరోసారి బయటపడింది. అదిల్ హుస్సేన్ థోకర్, సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఇద్దరి పేర్లు చూడటానికి దాదాపు ఒకే రకంగా ఉన్నాయి.
కానీచ ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఉం ది. అదిల్ హుస్సేన్ థోకర్ పర్యాటకులపై కాల్పులకు పాల్పడితే దాదాపు పేరు కలిగిన అదిల్ హుస్సేన్ షా పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాల్ని కోల్పోయి కశ్మీరియత్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచాడు. అదిల్ హుస్సేన్ షా ఒక సాధారణ కుటుంబానికి చెందిన ముస్లిం యువకుడు. పర్యాటకులను గుర్రంపై ఎక్కించుకుని పర్యాటక ప్రదేశాలకు తిప్పుడం ద్వారా డబ్బులు సంపాదిస్తాడు. ఇదే అతడి కుటుంబానికి జీవనాధారం. ఆయన ప్రాణాలు పోవడం విచారకరం. అయితే, ఉగ్రదాడిని ఖండించడం ద్వారా మతాలతో సంబంధం లేకుండా తామంతా భారతీయులమే అనే బలమైన సంకేతాన్ని దేశ ప్రజలు ఇచ్చారు.