05-05-2025 03:24:47 PM
మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని(Kaleshwaram) సరస్వతి పుష్కరాలు(Saraswati Pushkaralu) విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగు తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం కాళేశ్వరంలో విఐపి ఘాట్, సరస్వతి మాతా విగ్రహం ఏర్పాటు, శాశ్వత మరియు తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మాణం, టెంట్ సిటీ, ఫుడ్ కోర్టు, ఎగ్జిబిషన్, స్టాళ్లు ఏర్పాటు పనులను అధికారులతో కలిసి పనులను పరిశీలించారు.
ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పనకు చేపట్టిన పనులు ఈ నెల 10 వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుండి సరస్వతి తల్లి విగ్రహం ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. విఐపి ఘాట్ వద్ద తోరణ నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. సరస్వతీ ఘాట్, గోదావరి ఘాట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. టెంట్ సిటీ, ఫుడ్ కోర్టు, ఎగ్జిబిషన్, స్టాళ్లు ఏర్పాటు పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. మంచినీరు, భక్తులు బట్టలు మార్చు గదులు, గోదావరి హారతి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
తాత్కాలిక రహదారి నిర్మాణం జరుగుతుందని, నీళ్లు, బుల్డోజర్ ద్వారా చదును చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఇరిగేషన్, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, దేవాదాయ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, డిపిఓ వీరభద్రయ్య, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, ఆర్టీసీ డిఎం ఇందు, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపిడిఓ వెంకటేశ్వరరావు, దేవాలయ ఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.