05-05-2025 01:51:37 PM
కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
కొండాపూర్, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకుని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ కి స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకుని డోర్ పగులగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. మృతుడి భార్య మంజులకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. ఈ కారణంతో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో పిల్లలతో కలిసి సుభాష్ (40) ఉంటున్నాడు. మానసిక వేదనకు గురైన సుభాష్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కుమారుడు రిథిక్ మర్యాన్(9), కుమార్తె ఆరాధ్య(5)కి ఉరివేసి… అనంతరం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడ్డు. ముగ్గురి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.