05-05-2025 12:52:54 PM
హైదరాబాద్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ... ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువసార్లు రావడానికి నేను ఇష్టపడతానని గడ్కరీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన(Pradhan Mantri Gram Sadak Yojana) కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని వెల్లడించారు. రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా ప్రజలు భావిస్తారని ఆయన వివరించారు.
అమెరికా ధనికదేశం కాబట్టి రోడ్లు బాగున్నాయనేది సరికాదు.. రోడ్లు బాగున్నందునే అమెరికాను ధనిక దేశంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. ముఖ్యంగా 4 అంశాలు దేశ భవిష్యత్ ను నిర్దేశిస్తాయని ఆయన వెల్లడించారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌళిక వసతులు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయని నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిందని ఆయన చెప్పారు. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నామని తెలిపారు. జోజిలా పాస్ టన్నెల్ వంటి క్లిష్టమైన నిర్మాణాలను చేపట్టమన్నారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి(Suryapet to Devarapalli) వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామని కేంద్రమంత్రి తెలిపారు. నాగ్ పుర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టామని సూచించారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరగనుందని పేర్కొన్నారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. జగిత్యాల-కరీంనగర్ హైవే విస్తరణ నిర్మాణ పనులను త్వరలోనే చేపడతామని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్(Hyderabad traffic) సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంబర్ పేటలో నిర్మించిన పై వంతెనను ఇవాళే ప్రారంభించుకోనున్నామన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్, సీఎన్ జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పెట్రోల్ వాహనాలకు బదులుగా ఈవీ, సీఎన్ జీ వాహనాలు ఇంకా పెరగాలని గడ్కరీ ఆకాంక్షించారు. ఈవీ, సీఎన్జీ వాహనాల వినియోగంతో రవాణా ఖర్చ భారీగా తగ్గుతోందని చెప్పారు. వ్యవసాయంలో కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు.