27-04-2025 12:00:00 AM
కృష్ణస్వామి కస్తూరి రంగన్ శ్రద్ధాంజలి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) శుక్రవారం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త భారత శాస్త్రీయ సమాజంలో, అంతరిక్ష రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణం కేవలం ఒక వ్యక్తి నిష్క్రమణ కాదు, ఒక యుగం ముగింపు. భారత అంతరిక్ష కార్యక్రమాలకు బలమైన పునాదులు వేసిన ఈ మేధావి జీవితం, విజయాలు, దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కస్తూరి రంగన్ 1940లో కేరళలోని ఎర్నాకులంలో జన్మించారు. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్, అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ పొందారు.
విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరిన ఆయన, తన జీవితాన్ని శాస్త్రీయ పరిశోధనలకు, దేశసేవకు అంకితం చేశారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో ఛైర్మన్‌గా తొమ్మిదేళ్లపాటు సేవలందించిన ఆయన, భారత అంతరిక్ష రంగాన్ని అంతర్జా తీయ స్థాయిలో నిలబెట్టారు. ఈ కాలంలో ఇస్రో అనేక కీలక మైలురాళ్లను అధిగమించింది. ఇందులో చంద్రయాన్‌కు పునాది వేయడం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ), జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) వంటి ప్రాజెక్టుల అభివృద్ధి ప్రముఖమైనవి. భాస్కర భాస్కర- ఇన్‌షాట్ ఉపగ్రహాల ప్రయోగా లు ఆయన నాయకత్వంలో విజయ వంతమయ్యాయి.
ఇవి భారత ఉపగ్రహ సాంకేతికతలో విప్లవా త్మక మార్పులను తీసుకొచ్చాయి. కస్తూరి రంగన్ నాయకత్వం కేవలం శాస్త్రీయ విజయాలకే పరిమితం కాదు. ఆయన దూరదృష్టి, విశ్వసనీయత ఇస్రోను అంతర్జాతీయం గా గౌరవనీయ సంస్థగా నిలబెట్టా యి. ఇవన్నీ ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనం. మోదీ ఆయనను దార్శనిక నాయకుడుగా కొనియాడగా, ఇస్రో ఆయనను భారత అంతరిక్ష కార్యక్రమాల ప్రధాన రూపశిల్పిగా అభివర్ణించింది. ఈ నివాళులు ఆయన ఔన్నత్యాన్ని, దేశ ప్రగతిలో వారు పోషించిన పాత్రను స్పష్టం చేస్తాయి. కస్తూరి రంగన్ లేని లోటు భర్తీ చేయలేనిది. ఆయన జీవితం యువ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు స్ఫూర్తి. ఆయన విజయాలు భారత అంతరిక్ష రంగంలో చెరగ ని ముద్ర వేశాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం లభించాలని కోరుకుందాం. డాక్టర్ కస్తూరి రంగన్‌కు భారత శాస్త్రీయ సమాజం శిరస్సు వంచి నీరాజనం అర్పిస్తున్నది.
-డాక్టర్ కోలాహలం రామ్‌కిశోర్