22-10-2025 11:52:36 AM
ప్రారంభించిన మాధవానంద సరస్వతి స్వామి
గజ్వేల్: కార్తీక మాసం(Karthika Masotsavam) స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి(Nachagiri Lakshmi Narasimha Swamy Temple) క్షేత్రంలో గిరిప్రదక్షిణను ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ధర్మకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణను శ్రీ గురు మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మాధవానంద సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
గిరి ప్రదక్షిణ(Giri pradakshina) అంటే భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేయడమేనని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దేవుని సేవకు వచ్చే ప్రజలు ఎంతో అదృష్టవంతులు అన్నారు. నాచగిరి చుట్టూ 33 దేవతల విగ్రహాలను ప్రతిష్టించ సంకల్పించామని, భక్తులు విగ్రహ దాతలుగా ముందుకు రావాలని సూచించారు. దేవస్థాన చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, కార్య నిర్వహణ అధికారి విజయ రామారావు మాట్లాడుతూ గత గిరిప్రదక్షిణ కన్నా ఈసారి జరిగిన గిరి ప్రదక్షిణకు మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారని, కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భక్తుల సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.