22-10-2025 11:28:27 AM
ఎమ్మార్వో ఆదేశాలతో రంగంలోకి రెవెన్యూ సిబ్బంది
సెలవుల్లో రాత్రికి రాత్రే గోడల నిర్మాణం
గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్న కాలనీవాసులు
మణికొండ,(విజయక్రాంతి): మణికొండ మున్సిపాలిటీ(Manikonda Municipality) పరిధిలోని శివపురి కాలనీలో(Shivpuri Colony) ప్రభుత్వ స్థలం ఆక్రమణపై 'విజయక్రాంతి' దినపత్రికలో ప్రచురితమైన 'శివపురిలో కబ్జా' కథనానికి రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం జరుగుతున్న 60 గజాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి, అది "ప్రభుత్వ స్థలం" అని పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేశారు.
గతంలో ఇదే స్థలంలో అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు వ్యక్తులు వాటిని తొలగించారు. ఇటీవల దీపావళి పండుగ, వరుస సెలవులను అదునుగా భావించిన కబ్జాదారులు, రాత్రికి రాత్రే ఆ స్థలంలో గోడలు నిర్మించడం గమనార్హం. ఈ 60 గజాల స్థలాన్ని సుమారు 40 లక్షల రూపాయలకు విక్రయించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జాల నుండి కాపాడి, వాటిని మునిసిపాలిటీకి అప్పగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఆ స్థలంలో కాలనీ ప్రజలకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్ లేదా గ్రంథాలయం వంటివి ఏర్పాటు చేయాలని వారు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.