27-07-2025 01:15:59 AM
- ప్రభుత్వానికి ఐలాపూర్ నగర్ బాధితుల విజ్ఞప్తి
ఖైరతాబాద్, జూలై 26 (విజయక్రాంతి): నాలుగు దశాబ్దాలుగా కబ్జాదారుల చెరలో ఉన్న తమ రిజి స్ట్రేషన్ ప్లాట్లను తమకు అప్పగించాలని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులు రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లాడి సందీప్ కుమార్, ఉపాద్యక్షులు ఆర్.వి. రామమూర్తి, కోశాధికారి కె.రమేశ్, సంయుక్త కార్యదర్శి సి. రవికాంత్ రెడ్డి లు మాట్లాడారు.
సంగారెడ్డి జిల్లా ఐలాహర్ గ్రామంలో 495 ఎకరాల లే అవుట్ తమ ప్లాట్లకు 1984 నుంచి 89 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కబ్జాదారులు ప్లాట్ల దారులను బెదిరింపులకు గురిచేస్తూ ప్లాట్ల దగ్గరికి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. అంతేగాక, స్థానిక గ్రామస్తులతో దాడులు చేస్తున్నారని వాపోయారు. దీంతో ప్లాట్లు దక్కకపోవడంతో బాధిత 10వేల కుటుంబాలు సతమతమవ తున్నారని తెలిపారు.
తాము పొజిషన్లో ఉన్నా కబ్జాదారులు నోటరీ పేరిట 700 ఇండ్లు నిర్మించి అమ్మేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొంటున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా, హైడ్రా కమిషనర్ విన్నవించుకున్న తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్లాట్లు కొన్నవారిలో 400మందికిపైగా మృతిచెందారని తెలిపారు. త్వరలోనే సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి తమ సమస్య విన్నవించుకొంటామని తెలిపారు. తమ ప్లాట్లు తమకే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకొన్నారు.