calender_icon.png 7 October, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిడి ధర సరికొత్త రికార్డు!

07-10-2025 01:19:05 AM

  1. పది గ్రాముల పుత్తడి రూ.1.23 లక్షలు
  2. బంగారం ధర తాజా దూకుడుకు ఆజ్యంపోసిన అమెరికా షట్‌డౌన్ 
  3. కేంద్ర బ్యాంకులునిల్వలను పెంచుకోవడమూ కారణమే!

ముంబై, అక్టోబర్ 6(విజయక్రాంతి) : పసిడి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. 24 క్యారెట్ల నాణ్యమైన పది గ్రాముల బంగారం ధర రూ.1.23 లక్షలకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల మోత, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లు కలిసి పుత్తడికి ఇన్నాళ్లు డిమాండ్ పెంచగా.. తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్ ఇంకా కొనసాగుతుండడంతో బంగారం ధరకు పట్టపగ్గాల్లేకుండా పోయింది.

దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు ధర 4వేల డాలర్ల దిశగా పయనిస్తోంది. దీంతో అంతర్జాతీయ ధరలను అనుసరించి బంగారం ధర దేశీయంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు (31.10 గ్రాముల)ధర సోమవారానికి 3,935 డాలర్లకు చేరింది. డాలర్ విలువ రూ.88.79 కావడంతో దీని ధర ఎక్కువగా ఉంది.

ఈ ధరలను అనుసరించి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల నాణ్యమైన పది గ్రాముల బంగారం ధర రూ.1,23,420కి చేరుకుంది. 22 క్యారెట్ల  పుత్తడి ధర 1.10,700 పలుకుతోంది. అటు కిలో వెండి ధర కూడా లక్షన్నర దాటింది. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి సుమారు రూ.1.54లక్షలుగా ఉందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. 

షట్‌డౌన్‌తోనే..

బంగారం ధర తాజా దూకుడుకు అమెరికా షట్‌డౌన్ ఆజ్యం పోసింది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి డేటా ఏదీ అందుబాటులో లేదు. అమెరరికా ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ నిర్ణయాలకు కూడా ఈ డేటానే కీలకం. ఇంకా ఎన్నాళ్లీ అనిశ్చితి కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో పసిడికి తాజాగా మరింత డిమాండ్ పెరుగుతోంది.

ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు..డాలర్ ఇండెక్స్ క్షీణించడం, అమెరికా బాండ్ల రాబడి పడిపోవడం వంటివి ఇప్పటికే బంగారానికి డిమాండ్ పెంచాయి. మరోవైపు భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా డాలర్ బదులు కేంద్ర బ్యాంకులు పసిడి  నిల్వలను పెంచుకుంటూ ఉండడం కూడా మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.