మళ్లీ బంగారం ధగధగ
రూ.760 పెరుగుదల
హైదరాబాద్, మే 2: కొద్ది రోజులుగా మందకొడిగా ఉంటున్న బంగారం ధర గురువారం తిరిగి పెరిగింది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర 2,335 డాలర్ల స్థాయికి పెరగడంతో దేశీయ స్పాట్ మార్కెట్లో సైతం ఎగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 మేర పెరిగి, రూ.72,270 వద్దకు చేరింది. ఇది 10 రోజుల క్రితం రూ.74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన సంగతీ విదితమే. అటుతర్వాత రూ.71,500 స్థాయికి తగ్గింది. తాజాగా 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద పలుకుతున్నది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర 2,310 డాలర్ల కనిష్ఠస్థాయి నుంచి 2,335 డాలర్లకు పుంజుకున్న కారణంగా స్ఠానికంగా ధర పెరిగిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు. వెండి ధర సైతం కొంత పుంజుకున్నది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర ఒక్కరోజులోనే రూ.500 పెరిగి రూ.87,000 స్థాయికి దిగివచ్చింది.






