04-07-2025 01:15:50 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ‘నన్ను డమ్మీ అనే వాళ్లకు డాడీని అవుతా’నని తనను విమర్శించే వారిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యంగ్యాస్త్రాలను సంధిం చారు. తాను డమ్మీ లీడర్‌నా కాదా అనే ది త్వరలోనే తెలుస్తుందని అన్నారు. గురువారం ఓ మీడియాతో రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్ష పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తానని, ఈ పదవి తనకు కిరీటం కాదన్నారు.
తమ పోటీ ఎప్పుడూ కాంగ్రెస్‌తో ఉంటుందని, బీఆర్‌ఎస్ ట్విట్టర్ పార్టీ అని ఆ పార్టీతో ఎవరికీ ఉపయోగం లేదని విమర్శించారు. ప్రస్తుతం తన టార్గెట్ లోకల్ బాడీ ఎన్నికలని, వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాజాసింగ్ వ్యవహారం తమ పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని అన్నారు.
మొత్తం తెలంగాణలో తన కంటే ఫైర్ బ్రాండ్ ఎవరూ లేరన్నారు. తన రాజకీయ జీవితంలో మావోయిస్టులతో పోరాటం చేశానని, 14 సార్లు జైలుకు వెళ్లానని, లాఠీ దెబ్బలు తిన్నానని ఆయన తెలిపారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసి ఐకమత్యంగా పనిచేస్తున్నామని రాంచందర్ రావు చెప్పారు.