రాజ్యాంగాన్ని కాపాడేది ఓటరే
తొలిసారి ఈ ఎన్నికల్లో రాజ్యాంగం గురించి రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యం. కేంద్రం, రాష్ట్రాలలో మన రాజ్యాంగం ఉండాల్సిందేనని, రద్దు చేస్తారని, బతికిస్తామని, అనుమానమే అనీ అనేకానేక పార్టీలు మాట్లాడుతున్నాయి. ప్రత్యేకంగా ఓ పార్టీ రాజ్యాంగం రద్దు చేయనే చేయమని, నా మాట వినండంటూ నమ్మబలుకుతోంది. రాజ్యాంగం రద్దు జరగదని ప్రత్యేకంగా ప్రభుత్వ పక్షం చెప్పవలసి రావడమే ఒక విచిత్ర స్థితి. మొత్తం మీద ఎవరు రద్దు చేస్తారు? ఏ విధంగా చేస్తారు? అనే చర్చ కన్నా అసలు రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన అవసరం ఉందని ఓటర్లు ఆలోచించాలి.
ప్రతి ఒక్కరూ పార్టీ నాయకులు డబ్బులు ఏ విధంగా పంచాలంటూ ఆలోచిస్తున్నారు. ఫ్రీ ఫ్రీ అంటూ మన ఫ్రీడమ్‌నే కాజేసేందుకు చూస్తుంటే ఓటరు కాక మరెవ్వరు రాజ్యాంగాన్ని రక్షిస్తారు? రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని, తాము రక్షించుకుంటామని ప్రధానమంత్రి గ్యారెంటీ ఇస్తున్నట్టు అర్థమవుతున్నది. ఇది ఒక అదృష్టంగా ఈ దేశ ప్రజలంతా నమ్మాలి మరి. వెంటనే మతం ఆధారంగా రిజర్వేషన్లు ముసుగులో రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. తాను మూడోసారి గెలిస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడతాయని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై మోదీ విరుచుకుపడ్డారు.
మధ్యలో ఈ పెద్దలంతా అంబేడ్కర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసినందుకు అంబేడ్కర్ ఆత్మ మనల్ని తప్పక ఆశీర్వదిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. జనం ఆ మాట నమ్ముతారా లేదా అనే విషయం పక్కనబెడితే వారి తీర్పు ఏ విధంగా ఉంటుందో ఇంకా చెప్పలేమన్నారు. “బీజేపీ ప్రభుత్వానికి దేశ రాజ్యాంగమే సర్వస్వం. బాబాసాహెబ్ అంబేడ్కర్ స్వయంగా వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు” అని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి, రాష్ట్రాల్లో 100 సార్లు రాష్ట్రపతి పాలన తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి చేసిందన్నారు.
ఈ మాటలను బట్టి వాళ్లు రాజ్యాంగాన్ని నిజంగా నమ్ముతున్నారా? లేక లక్షల కోట్ల రూపాయల జాతి ఆస్తులను అమ్ముకోవడానికి చూస్తున్నారా? ఎన్నికల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన దేశంలో ఉన్నాం మనం. ఈ పరిస్థితి నుంచి ఓట్ల సాయంతో జనం రక్షణ పొందాల్సి ఉంది. అసలు పెద్ద సమస్య ఏమంటే విరాళం అనే తీయనైన మాటల ద్వారా లంచాలా తీసుకునేది? దీన్ని చట్టబద్ధం చేస్తారా? అన్న సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాల్సిన అవసరం ఉంది. 370 ఆర్టికల్ విషయంలో ప్రతిపక్షాలను ప్రభుత్వం విపరీతంగా విమర్శిస్తోంది. బీజేపీ మరోసారి గెలిస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందనే భయం ఓటర్ల ముందు అజెండా అయింది.
ఫలానా పార్టీ గెలవడం లేదా ఓడిపోవడం ఇప్పుడు ప్రజాస్వామ్య సమస్య అయిపోయింది. ఈ దేశ రాజ్యంగాన్ని రక్షించేందుకు కృషి చేస్తున్నట్టు రాహుల్‌గాంధీ చెబుతున్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజ్యాంగం మారితే రిజర్వేషన్లు రద్దు అవుతాయని అంటున్నారు. దేశంలో బీజేపీ ధనికులు కోసం పని చేస్తోంది, సంపన్నులకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందనీ, ఆ డబ్బులతో దేశంలోని పేదలకు ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇవ్వవచ్చని రాహుల్ వివరిస్తున్నారు. ఇండియా పేరుతో పనిచేస్తున్న ప్రతిపక్ష కూటమి అనేకానేక హామీలు ఇచ్చింది.
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తామని, ఒక సంవత్సరం పాటు శిక్షణతో పాటు రూ.8,500 భృతితో పాటు రూ.లక్ష సాయం చేస్తామని, దేశంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అటవీ భూములపై మొదటి హక్కులు ఆదివాసులవేనని, వారి భూసమస్య పరిష్కరిస్తామని, ఉపాధి హామీ వేతనాన్ని రూ.400కు పెంచతామని, దళిత, గిరిజన, బీసీ, మైనార్టీల జనాభా కలిసి 90 శాతం ఉన్నారని, వారికి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారు.
42వ సవరణ.. మినీ రాజ్యాంగం
అయితే, రాజ్యాంగాన్ని తీవ్రంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ అని చరిత్ర చెబుతున్నది. 42వ సవరణ ప్రమాదకరమైనదని, ఇందులో చేసిన కొన్ని తీవ్రమైన మార్పులను రద్దు చేసిన తర్వాత రాజ్యాంగాన్ని బతికించామని 1977 అనంతరం ప్రభుత్వాలు చెప్పాయి. చట్టాల రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాన్ని ఈ సవరణ తగ్గించేందుకు ప్రయత్నించింది. ఇది భారతీయ పౌరులకు ప్రాథమిక విధులను కూడా నిర్దేశించింది. ఈ సవరణ రాజ్యాంగ చరిత్రలో అత్యంత విస్తృతమైన మార్పులను తీసుకొచ్చింది. 59 క్లాజుల్లో సుప్రీంకోర్టుకు అనేక అధికారాలను తొలగించింది.
పార్లమెంటరీ సార్వభౌమాధికారం వైపు రాజకీయ వ్యవస్థను తరలించింది. అందుకే దీనికి మినీ రాజ్యాంగమని పేర్కొంటాం. అదే సవరణలో పీఠికలో కూడా మార్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రవేశికలో “సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్రం” నుంచి “సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర” అని కొత్తగా చెప్పుకున్నాం. “జాతి ఐక్యత” అనే పదాలను “ఐక్యత సమగ్రత”గా మార్చింది. జనతా ప్రభుత్వం 1977, 1988లో 43, 44వ సవరణలను తెచ్చి 1976కి ముందు ఉన్న స్థితిని పునరుద్ధరించింది. విధులను చేర్చడం, పదాల మార్పు వంటివి ఉపన్యాసాలు, నీతిబోధనలు మాత్రమే. వాటితో చేసేదేమీ లేదు.
ఈ మార్పులు నిజమైనవేనా? వాటివల్ల నష్టం జరిగిందా? లేదా మంచి మార్పు కలిగిందా అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రాథమిక విధులను చేర్చడం దేశానికి పనికి వచ్చేదని అన్నారు. దీని వల్ల పెద్ద లాభం లేకపోయినా నష్టమైతే జరగలేదు. రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక మాటలు చేర్చినా లేదా తీసేసినా, ఐక్యత సమగ్ర అనే మాటలు గొప్పగా, కొత్తగా సాధించిందేమీ లేదు. కానీ రాజ్యాంగంలో లౌకిక పదాన్ని తీసేస్తే తీవ్రమైన హాని కలుగుతుంది. 1980లో మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు 42వ సవరణలోని రెండు నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఇది ఏ రాజ్యాంగ సవరణను “ఏ కారణాలపైన ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించకుండా” నిరోధించడానికి తీసుకొచ్చారని ఆరోపించింది. వ్యక్తుల ప్రాథమిక హక్కుల కన్నా రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది. ఈ మార్పులు, జనతా సవరణలు, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మన రాజ్యాంగం సజీవంగా కొనసాగింది.
సుప్రీంకోర్టులో గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్ 42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన “సోషలిస్ట్” పదాన్ని సవాల్ చేస్తూ 2008లో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. “కమ్యూనిస్టులు నిర్వచించిన సంకుచిత కోణంలో మీరు సోషలిజాన్ని ఎందుకు తీసకుంటారు? అందులోని మంచి ఉద్దేశాన్ని తీసుకోవచ్చు కదా” అని తన తీర్పులో సుప్రీంకోర్టు వివరించింది. దీనిపై సరైన వివరణలు ఉన్నా దీనికి విపరీతార్థాన్ని తీసుకొస్తూ పీఠికను, రాజ్యాంగ మౌలిక లక్షణాలనూ విధ్వంసం చేసి తద్వారా రాజ్యాంగాన్ని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడం దారుణం.
1973లో కేశవానంద భారతి కేసులో రాజ్యాంగంలోని ఏదైనా భాగాలను సవరించడానికి పార్లమెంటుకు అపరిమిత అధికారాలు లేవని, చట్టాలపై న్యాయ సమీక్ష తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పదాలు మార్చడం, కొత్త వాదనలు తీసుకొచ్చి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ధ్వంసం చేస్తున్నారని రాజకీయ ప్రచారాల్లో ప్రసంగాలు చేయడం దేశానికి ఏ విధంగా ఉపకరించదు. ఈ తరుణంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రతి ఓటర్ తన బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తద్వారా తప్పుడు పనుల ద్వారా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికలను ప్రభావితం చేయడాన్ని ఆపాలంటే ఓటరు తన కర్తవ్యాన్ని విస్మరించకూడదు. ఓటు ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.
1950 నాటి మన రాజ్యాంగ పీఠిక
భారత ప్రజలమైన మనము, మన దేశాన్ని సార్వభౌమ, గణతంత్య్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్రదీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల్ని; ఆలోచనా, భావప్రకటన, మతవిశ్వాస ఆరాధన స్వేచ్ఛను; హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని సాధిచేందుకు; వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యత కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందిచాలని; మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీకరించి, ఆమోదించి, మనకు మనము సమర్పించుకుంటున్నాము.
42 సవరణ తరువాత..
భారత ప్రజలమైన మనము, మన భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల్ని; ఆలోచన, భావప్రకటన, మత విశ్వాస ఆరాధన స్వేచ్ఛను; హోదాల్లోనూ అవకాశాలలోనూ సమానత్వాన్ని సాధించేందుకు; వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపాదించాలని; మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరించి, ఆమోదించి, మనకు మనము సమర్పించుకుటున్నాము.
కాళోజీ ఏమన్నాడో వినండి...
అభ్యర్థి ఏపార్టీ వాడని కాదు.. ఏపాటి వాడో చూడు
ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు.. ఇప్పటిదాకా ఏంచేశాడో చూడు.
పెట్టుకున్న టోపి కాదు..
పెట్టిన టోపీ చూడు
ఎగరేసిన జెండా కాదు..
చాటున ఆర్జించిన చందా చూడు
మాడభూషి శ్రీధర్




