9 April, 2026 | 2:02 AM

ఈత చెట్ల్లు నరికి వేయడంపై గౌడ నాయకుల ఆగ్రహం

09-04-2026 12:10 AM

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

గజ్వేల్, ఏప్రిల్ 8: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో గౌడ సమాజానికి జీవనాధారమైన ఈత వనాన్ని నరికి వేసిన ఘటనపై గౌడ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా ఈత వనాన్ని పెంచి పోషిస్తున్నామని తెలిపారు. కల్లు గీసే సమయానికే చెట్లను నరికి వేయడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొందరు నాయకులు కావాలనే కుల వివాదాలను రెచ్చగొట్టి గ్రామస్థుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

సుమారు రెండు వందల ఈత చెట్లను ఉద్దేశపూర్వకంగా నరికి వేసినట్లు తెలిపారు. తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, చెట్లను నరికివేయడం వల్ల గౌడ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈత చెట్లు నరికి వేసిన ప్రాంతాన్ని ఎక్సైజ్ సిబ్బంది  బ్రహ్మానందరెడ్డి సిబ్బందితో  కలిసి పరిశీలించారు. విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ సభ్యులు ఆర్. స్వామి గౌడ్, జె. రమేష్ గౌడ్, బి. శివరాములు గౌడ్, నరేష్ గౌడ్, రాజులు గౌడ్, కృష్ణ గౌడ్, విజేందర్, రమేష్ గౌడ్, శంకర్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు, గౌడ సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.