11-10-2025 02:05:24 AM
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి సారించింది. ఒకవైపు కుంగుబాటుకు గురైన కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటూనే, మరోవైపు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తుంది. సాగునీటి రంగంలో కీలకంగా భావిస్తున్న తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఈ నెల 22 తర్వాత మహారాష్ర్ట ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పూర్తి చేయడంపై ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్వే పూర్తి చేసింది. దీనికి సంబంధించి రెండు ప్రణాళికలను రూపొందించింది. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం ఒక మార్గం అయితే, తుమ్మిడిహెట్టి నుంచి డైరెక్ట్‌గా ఎల్లంపల్లికి మధ్యలో ఒక లిఫ్ట్‌ఏర్పాటు చేసి నీటిని తరలించాలని మరో మార్గంగా ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ రెండు ప్రణాళికల సాధ్యాసాధ్యాలపై నివేదికలు సిద్ధం చేయడానికి కరీంనగర్, మంచిర్యాల చీఫ్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో అంచనాల తయారీ జరుగుతున్నట్టు సమాచారం. అయితే తుమ్మిడిహెట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించడం వల్ల మరో లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో అదనపు ఖర్చు భారం తప్పని నేపథ్యంలో సుందిళ్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.
దీని వల్ల సుమారు రూ.7 వేల కోట్ల నుంచి 8 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది. దీనికితోడు ఈ ఎస్టిమేషన్లు ఈ నెల 22 నాటికి పూర్తి కానున్న క్రమంలో ఆ తర్వాత వెంటనే మహారాష్ర్టతో రాష్ర్ట ప్రభుత్వం చర్చలు జరపనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో మహారాష్ట్రతో చర్చలు
వాస్తవానికి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రారంభ సమయంలో నిర్మించే బరాజ్ ఎత్తును 152 మీటర్లుగా అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ దానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. దీనివల్ల తమ భూభాగంలో ముంపు ఏర్పడుతుందని అభ్యంతరం తెలిపింది. ఇదే కారణాన్ని చూపుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 150 మీటర్ల మధ్యకు తగ్గించి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
ఈ అంశంపై మహారాష్ర్ట ప్రభుత్వంతో చర్చలు జరపాలని చూస్తున్నది. దీనిపై ఈ నెల 22 తర్వాత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మహారాష్ర్ట ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు విజయవంతమై తెలంగాణ ప్రతిపాదనలకు మహారాష్ర్ట ప్రభుత్వం అంగీకరిస్తే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీ ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రాణహిత నిర్మాణం దిశగా..
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అనేక సానుకూల అంశాలున్నాయని ఇరిగేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) తీర్పు ప్రకారం, ఇక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత ఉండటంతోపాటు నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం చాలా సులభతరమవుతుందని చెబుతున్నారు. ఇక తుమ్మిడిహెట్టి నుంచి నీటిని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు, కాళేశ్వరంతో పోలిస్తే నామమాత్రమే.
అంచనాల ప్రకారం, తుమ్మిడిహెట్టి బ్యారేజీకి అయ్యే వార్షిక కరెంటు ఖర్చు సుమారు రూ.150 కోట్లు మాత్రమే. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా దాదాపు 72 కిలోమీటర్ల పొడవైన ప్రధాన గ్రావిటీ కెనాల్‌ను ఇప్పటికే నిర్మించింది. ఇప్పుడు ఆ కాలువను వినియోగించుకుంటే నిర్మాణ వ్యయం, సమయం ఆదా అవుతాయని భావిస్తున్నారు.