11-10-2025 01:52:03 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ శుక్రవారం తన కుమార్తె మాగంటి అక్షరతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే జూబ్లీహిల్స్‌లో దివంగత నేత మాగంటి గోపీనాథ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని, అభివృద్ధికి సహకరించాలని వారు ప్రజలను కోరారు.
యూసఫ్‌గూడ డివిజన్ పరి ధిలోని వెంకటగిరిలో ఉన్న మహమ్మదీయ మసీదు వద్ద శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం సునీత, అక్షర ముస్లింలను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా వాతావరణం ఉద్వేగభరితంగా మారింది. దివంగత నేత మాగంటి గోపీనాథ్‌తో తమకున్న దశాబ్దాల అనుబంధాన్ని పలువురు ముస్లిం పెద్దలు, స్థానికులు గుర్తుచేసుకున్నారు. “గోపన్న మా మనిషి. మా కష్టసు ఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలిచారు.
ఆయన వారసురాలిగా బరిలో ఉన్న మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మీ వెంటే మేము నడుస్తాం, మీ విజయం కోసం కృషి చేస్తాం” అని వారు సునీతకు భరోసా ఇచ్చా రు. అనంతరం మసీదు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారస్తులను, స్థానిక ప్రజలను కలుసుకొని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కుమారుడు అజాం అలీ, కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటే ల్, సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్, సతీష్‌రెడ్డి, రమేష్, డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్ పాల్గొన్నారు.