11-10-2025 01:59:10 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో, నార్సింగి వద్ద నిర్మిస్తు న్న ‘ఆదిత్యా వాంటేజ్’ ఆకాశహర్మ్యంపై సోషల్ మీడియాలో తీవ్ర దుష్ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును మూసీ నదిలోనే అక్రమంగా నిర్మిస్తున్నారంటూ కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.
అయితే, ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు, హెచ్‌ఎండీఏ, రెరా వంటి అన్ని ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొందిన తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని స్పష్టమవుతోంది. వాస్తవానికి, మూసీ ప్రవాహానికి మానవ తప్పిదాల వల్ల ఏర్పడిన అడ్డంకులే వరద నీరు ప్రాజెక్టు వైపు మళ్లడానికి అసలు కారణమని తేలింది.
వాస్తవాలేమిటి?
ఉస్మాన్‌సాగర్ గండిపేట నుంచి ప్రవహించే మూసీ నది, నార్సింగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డును దాటుతుంది. దశాబ్దన్నర క్రితం ఓఆర్‌ఆర్ నిర్మాణ సమయంలో నదీ ప్రవాహం కోసం ఓపెన్ బ్రిడ్జికి బదులుగా కొన్ని తూములను, కల్వర్టులు ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఆ తూములు చెత్తాచెదారంతో పూర్తిగా మూసుకుపోయాయి. దీనికి తోడు, నదికి ఒకవైపున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మట్టి, బండరాళ్లు, నిర్మాణ వ్యర్థాలను వేశారు.
కృత్రిమంగా ఎత్తు పెంచేశారు. అంతేకాకుండా, నదీ ప్రవాహంలోనే భారీ బేస్మెంట్లతో హై టెన్షన్ విద్యుత్ లైన్ స్తంభాలను నిర్మించడంతో నది సహజ ప్రవాహ మార్గం కుంచించుకుపోయింది. ఈ కారణాల వల్లే, ఎగువ నుంచి వచ్చే వరద నీరు సాఫీగా ముందుకు వెళ్లలేక, పల్లంగా ఉన్న బఫర్ జోన్‌లోని ఆదిత్యా వాంటేజ్ ప్రాజెక్టు వైపు మళ్లుతోంది.
ఈ సమస్యను గుర్తించిన ఆదిత్యా కేడియా రియల్టర్స్ సంస్థ, ఈ అడ్డంకులను తొలగించాలని కోరుతూ గతంలోనే హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులకు లేఖల ద్వారా విన్నవించింది. అంతేకాదు, గత ఏడాది జనవరి 10వ తేదీనే ఇరిగేషన్, సీఏడీ విభాగానికి సైతం ఫిర్యాదు చేసింది.
అన్ని అనుమతులతోనే నిర్మాణం
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన హెచ్‌ఎండీఏ.. ఈ ప్రాజెక్టుకు హైకోర్టు అనుమతి మేరకే నిర్మాణ అనుమతులను పునరుద్ధరించినట్లు అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇది అక్రమ నిర్మాణం కాదని, అన్ని చట్టపరమైన నిబంధనలకు లోబడే నిర్మాణం జరుగుతోందని తేటతెల్లమైంది. నదిలోని పూడిక, చెత్తాచెదారం, అక్రమంగా పోసిన మట్టిని తొలగించి, తూములను సరిచేస్తే మూసీ ప్రవాహం సజావుగా సాగుతుందని నిపుణులు చెపుతున్నారు.
ఈ పనుల్లో ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆదిత్యా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికైనా, వాస్తవాలను గ్రహించి, అసలు సమస్య అయిన మూసీలోని అడ్డంకులను తొలగించడంపై దృష్టి సారించాలే తప్ప, చట్టబద్ధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.