07-02-2026 06:00:00 AM
ఎల్బీనగర్, ఫిబ్రవరి 6 : ప్రభుత్వ భూమి అని జీహెచ్‌ఎంసీ బోర్డు ఉన్నా ఆక్రమణదారులు ఇవేవీ పట్టనట్టు దర్జాగా కబ్జా చేస్తున్నారు. కండ్ల ఎదుట ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్నా అధికారులు స్పందించడం లేదు. హయత్ నగర్ మండలం జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యే సమయం లో అప్పటి అధికారులు ఇక్కడి ప్రభుత్వ భూమిని జీహెచ్‌ఎంసీకి అప్పగించారు.
ఇప్పుడు కబ్జా అవుతున్నా జీహెచ్‌ఎంసీ, హయత్ నగర్ తహసీల్దార్ స్పందించడం లేదు. ఆ భూమి పరిరక్షణ మాది కాదు.. మీది అంటూ కండ్లు తెరవడం లేదు. స్థానికులు సైతం ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరినా అడ్డుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు బోర్డు పెట్టినా.. రీ సర్వే పేరుతో కబ్జాలోకి వెళ్లడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.
రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించే అధికారుల్లో కొంతమంది అక్రమణదారులకు జై కొడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ - ఇంజాపూర్ రోడ్డు మార్గమధ్యలో అనుమగల్ పరిధి, జాలు కాలువ దగ్గరలో సర్వే నంబర్ 191లో సుమారు 1.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలం ప్రభుత్వ భూమి అని జీహెచ్‌ఎంసీ అధికారులు బోర్డు పెట్టారు. ఈ భూమి సమంగా కాకుండా అష్టవంకరులు తిరిగి ఉంటుంది.
దీనిని ఆసరాగా చేసుకుని కొందరు రిజిస్ట్రేషన్ ప్లాట్ల హద్దులను ఆధారంగా కొంచెంకొంచెంగా చదును చేసుకుంటూ స్థలాన్ని ఆక్రమించుకుని, పునాదులు వేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమి నుంచి లక్ష్మీప్రియకాలనీకి రోడ్డు వేశారు. ఈ కాలనీకి రోడ్డు దూరంగా ఉండడంతో ఇంజాపూర్ రోడ్డు నుంచి ప్రభుత్వ భూమి మీదుగా కాలనీకి రోడ్డు వేసి, బోర్డు నాటారు. పక్కనే ఉన్న ఆ భూమిని ఇప్పుడు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. 1.09 ఎకరాల భూమికి రక్షణకు జీహెచ్‌ఎంసీ వేసిన కడీలు, పెన్సింగ్ తొలగించి, ప్రీకాస్ట్ వాల్స్ తీసేశారు.
ఇక్కడి ప్రభుత్వ భూమికి నాటి ఇబ్రహీంపట్నం ఆర్డీవో, హయత్ నగర్ మండల తహసీల్దార్ సర్వే చేసి, హద్దులు నిర్ణయించారు. స్థలం చుట్టూ కడీలు పాటించారు. అప్పటి హయత్ నగర్ తహసీల్దార్ ప్రమీలారాణి ఆదేశాలతో అక్రమంగా నిర్మించిన పునాదులను తొలగించారు. దీంతో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అదేశాలతో 2022 అక్టోబర్ లో స్థలాన్ని జీహెచ్ ఎంసీకి అప్పగించారు. కానీ, ప్రభుత్వ భూమిని రక్షించడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు విఫలమవుతున్నారు.
అయితే, నాలుగేళ్ల తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు, అధికారుల అండతో ప్రభుత్వ స్థలాన్ని పొందేందుకు ఏడీతో రీ సర్వే చేయిస్తున్నారు. 2022లోనే రెవెన్యూ, సర్వే అధికారులు ప్రభుత్వ భూమిని జీహెచ్‌ఎంసీకి ఇచ్చిన తర్వాత కబ్జాదారులకు అధికా రులు సహకరిస్తూ అక్రమార్కులకు అనుకూలంగారీ సర్వేకు అనుమతులు ఇవ్వడం ప్రజల్లో అనేక ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై హయత్ నగర్ తహసీల్దార్ ను వివరణ కోరగా.. ఇంజాపూర్ సమీపంలోని ప్రభుత్వం భూమిని గతంలోనే హద్దులు నిర్దారించి, జీహెచ్‌ఎంసీకి 1.09 ఎకరాలను అప్పగించామని తెలిపారు. ఆ భూమి పరిరక్షణ జీహెచ్‌ఎంసీ దేనని, మా పాత్ర ఏమీ లేదన్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో సర్వేయ ర్‌ను పంపించామని, ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై జీహెచ్‌ఎంసీకి లేఖ రాశామని వివరించారు.