బాలికకు అండగా ప్రభుత్వం
- బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరు
- నిమ్స్‌లో పరామర్శించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ఘటనలో బాధిత బాలికకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5 లక్షలు మంజూరు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక అన్నారు. అత్యాచార యత్నానికి గురై తీవ్ర గాయాలతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను మంత్రి శనివారం పరామర్శించారు.
బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, సీపీఐ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యంతో కలిసి బయట కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు చికిత్స అందిస్తున్న వైద్యుల నుంచి బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు.
బాలికకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని నిమ్స్ డైరెక్టర్ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ... ఈ దుర్మార్గమైన ఘటన జరగడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు నిమ్స్‌లోనే అత్యుత్తమ చికిత్స అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
అదేవిధంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఇప్పటివరకు రూ.70 వేల తక్షణ సహాయం అందించారు. కుటుంబానికి అండగా ఉండేందుకు ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విష్ణు వందనను నిమ్స్‌లోనే అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడిన మంత్రి సీతక్క, నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చట్టపరంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.






