11-09-2025 12:00:00 AM
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తిమ్మాపూర్, సెప్టెంబర్10(విజయక్రాంతి):దివ్యాంగుల జీవన ప్రమాణాల పెంపుతోపాటు వారికి జీవనోపాధి కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు రాష్ట గిరిజన,మైనారిటీ,సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్.ఏం.డి కాలనీలో స్వాతంత్ర సమర యోధుల ట్రస్టీ ఆధ్వర్యంలో నడుపుతున్న మానసిక వికలాంగుల పాఠశాలలో ఎల్వీ.ప్రసాద్ కంటి ఆసుపత్రి సిద్దిపేటశాఖ వారిచే బుధవారం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు వారికి జీవనోపాధి కల్పించడం కోసం 50 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు చెప్పారు. సేవా భావంతో నిర్వహిస్తున్న ఇలాంటి పాఠశాలలకు ప్రభుత్వ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు.తాను మంత్రినయ్యాక కరీంనగర్ లోని మానసిక వికలాంగుల పాఠశాలకు చేయూతనందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పాఠశాలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మానసిక వికలాంగులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏడాది నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ఈ సందర్భంగా మంత్రిని కోరారు. రాష్ట్ర మానసిక వికలాంగులశాఖ డైరెక్టర్ శైలజ సమర యోధుల ట్రస్ట్ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ తదితరులుపాల్గొన్నారు.