26-01-2026 12:05:26 PM
హైదరాబాద్: 2047 నాటికి భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించి, దేశం మొత్తం వృద్ధికి గణనీయంగా తోడ్పడాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) సోమవారం అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఇటీవలే రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ ఆవిష్కరించిందని తెలిపారు. రైజింగ్ తెలంగాణ-2047లో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని వెల్లడించారు.
హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని మూడు ఎకానమ జోన్లుగా ప్రభుత్వం విభజించిందన్నారు. మూడు కీలక రంగాలకు ప్రత్యేకమైన 3 జోన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. గతేడాది నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గిన్నిస్ బుక్ లో చోటు దక్కిందన్నారు. 26 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. సన్నవడ్లపై క్వింటాల్ కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. ధాన్యానికి బోనస్ గా రైతులకు రూ. 1780 కోట్లు చెల్లించామని వెల్లడించారు.
ఈ జాతీయ దార్శనికతకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం వృద్ధికి గణనీయంగా తోడ్పడుతూ, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ ఆకాంక్షను సాధించడం కోసమే 'తెలంగాణ రైజింగ్ – విజన్ 2047' డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా మేడారం గిరిజన గ్రామంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం గిరిజన జాతరకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనడానికి నిదర్శనమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. మేడారం అభివృద్ధి కోసం రూ. 251 కోట్లు కేటాయించామని చెప్పారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని సూచించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్, డీజీపీ, పలువురు మంత్రులు పాల్గొన్నారు.