25 March, 2026 | 11:47 PM

అమ్రాబాద్ గిరిజనుల పునరావాసానికి ప్రభుత్వం ముందడుగు

25-03-2026 10:15 PM

అచ్చంపేట: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నివసిస్తున్న గిరిజన కుటుంబాల అభివృద్ధి, అటవీ వన్యప్రాణి సంరక్షణను సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని  గిరిజన గ్రామాలకు చెందిన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా మొదటి దశలో నాలుగు గ్రామాలకు చెందిన మొత్తం 417 కుటుంబాలకు పునరావాసం కల్పించే దిశగా ముందడుగు పడింది.

అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో 14 మంది గిరిజన కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అమ్రాబాద్ అడవుల్లో శతాబ్దాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తున్న గిరిజనుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

అదే సమయంలో అటవీ, వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. “ఇది సాధారణ పరిపాలనా నిర్ణయం కాదు… చారిత్రాత్మక సామాజిక–పర్యావరణ సంస్కరణ” అని ఆయన పేర్కొన్నారు. గిరిజన కుటుంబాలను స్వచ్ఛందంగా పునరావాసం చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పులులు సహా వన్యప్రాణులకు సహజ ఆవాసాలు తిరిగి లభిస్తాయని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా గిరిజనుల అభీష్టం మేరకే జరుగుతోందని చెప్పారు.

వారి ఎంపిక ప్రకారం రెండు విధాలుగా సహాయం అందిస్తున్నారు:

• 160 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల నగదు పరిహారం

• 257 కుటుంబాలకు నాగర్‌కర్నూల్ జిల్లా బచారం వద్ద ఆధునిక గృహ వసతితో పాటుగా 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నామని తెలిపారు.

సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాలపెంట, కొల్లంపెంట గ్రామాలకు చెందిన కుటుంబాల అభివృద్ధికి మొత్తం రూ.62.55 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రూ. 24 కోట్లు నగదు పరిహారం కోసం, రూ. 38.55 కోట్లు గృహ వసతి కోసం వినియోగిస్తున్నామన్నారు. బచారం వద్ద ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. “ఇది కేవలం ఇళ్ల మార్పిడి కాదు… జీవన మార్పిడి” అని మంత్రి స్పష్టం చేశారు. పునరావాసం తర్వాత గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా, ప్రతి కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా కల్పించనున్నట్లు తెలిపారు.

గిరిజన పిల్లలకు ఆధునిక పాఠశాలలు, అంగన్‌వాడీలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా వారి ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేస్తామని తెలిపారు. నగదు పరిహారం కింద ఇచ్చే రూ. 15 లక్షలు దేశంలోనే అత్యధిక పరిహారాల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 1501 హెక్టార్ల అటవీ భూమి పునరుద్ధరించబడుతుందని, పులులు సహా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. పులుల సంఖ్య పెంపుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని అన్ని మౌలిక వసతులతో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివరించారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్లు, రైతు వేదికలు వంటి అన్ని సదుపాయాలు ఒకేచోట అందుబాటులో ఉంటాయని తెలిపారు. పీసీసీఎఫ్ డా. సువర్ణ మాట్లాడుతూ, ఈ పునరావాసం అటవీ సంరక్షణకు కీలకంగా మారుతుందని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి, వన్యప్రాణి సంరక్షణ రెండింటినీ సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా అటవీ సంరక్షణకు కూడా దోహదపడే సమగ్ర కార్యక్రమంగా నిలుస్తుందని తెలిపారు.