పట్టభద్రులు పనిచేసే వారికి ఓటు వేయాలి
జయశంకర్ భూపాలపల్లి (ములుగు), మే 24 (విజయక్రాంతి): పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసే వారికి ఓటు వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ములుగు మండలం ఇంచర్లలోని ఎంఆర్ గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ అక్రమాలను ఎలుగెత్తి చాటారన్నారు. దీంతో నాటి సీఎం కేసీఆర్ కక్ష కట్టి ఆయన్ను జైలుకు పంపించారని గుర్తుచేశారు. అధికారం పోయినా మాజీ మంత్రి కేటీఆర్‌కు అహం తగ్గలేదని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్‌కు ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పట్టభద్రులు తనను ఎన్నికల్లో గెలిపిస్తే తల ఎత్తుకునేలా పని చేస్తానన్నారు. తనకు వేసే మొదటి ప్రాధాన్యత ఓటు సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి చేరుతుందన్నారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్, నాయకు రవళీరెడ్డి, డాక్టర్ పులి అనిల్ పాల్గొన్నారు.






