22-12-2025 06:21:29 PM
పెద్ద గ్రామ పంచాయతీలకు 60 నుండి 70 లక్షల ఖర్చు
చిన్న గ్రామ పంచాయతీలకు 40 లక్షల పైచిలుకు ఖర్చు
గెలుపు కొరకు భూములు ఆస్తుల అమ్మకాలు
వేములపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నిన్న గెలిచిన సర్పంచులు ప్రమాణ స్వీకారాలు ముగియడంతో వారి వారి పదవుల్లో బాధ్యతలు స్వీకరించారు. వేములపల్లి మండలంలో రెండో విడతలో 12 గ్రామపంచాయతీ లో భాగంగా ఎన్నికలు పూర్తి అయ్యాయి. వేములపల్లి లో 3602 ఓటర్లు ఉండగా, శెట్టిపాలెం 3411, తిమ్మారెడ్డి గూడెం 654, మొల్కపట్నం 1692, అన్నపురెడ్డిగూడెం 760, రావులపెంట 2709, సల్కునూరు 1581, మంగాపురం 765, లక్ష్మీదేవి గూడెం 1169, ఆమనగల్లు 2475, 625, బుగ్గ బాయ్ గూడెం 1002 ఓటర్లు ఉండగా 12 గ్రామపంచాయతీలో మొత్తం ఓటర్లు 20568 మంది ఓటర్లు ఉన్నారు.
కాగా గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు చేసిన ఖర్చు సుమారు 9 కోట్ల పైచిలుకే అని రాజకీయ విశ్లేషకులు, ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పోటీదారులు కొంతమంది గెలవాలని తపనతో వారికున్న కొద్దిపాటి భూములను సైతం అమ్మడానికి వెనుకాడ లేదు. అదేవిధంగా గెలుపు కోసం తమకున్న ఇండ్లపై బంగారం పై రుణాలు తీసుకొని మరి ఖర్చు చేశారనేది వినికిడి. మేజర్ గ్రామపంచాయతీలకు 60 నుంచి 70 లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు 40 నుంచి 50 లక్షలు ఖర్చుపెట్టి గెలిస్తే గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమైద్దని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.