పది ఫలితాల్లో గురుకుల విద్యార్థుల హవా
153 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత
గురుకుల సొసైటీ కార్యదర్శి బి.సైదులు హర్షం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ గురుకుల విద్యార్థులు 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర సగటు కంటే 6.94 శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదు చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 261 పాఠశాలల్లో 153 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని వివరించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 391 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి ప్రతిభ చాటారన్నారు. ఈ ఏడాది 17,845 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 17,533 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని ఆయన అభినందించారు.




