హైదరాబాద్‌లో పలుచోట్ల హెచ్-ఫాస్ట్ అధికారుల తనిఖీలు
హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ విభాగంలోని 'హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST), జీహెచ్ఎంసీ (GHMC) ఆహార భద్రతా విభాగంతో కలిసి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని సుగంధ ద్రవ్యాల వ్యాపార, తయారీ కేంద్రాలపై విస్తృత తనిఖీలు నిర్వహించింది. మానవ ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను కల్తీ పదార్థాలుగా వాడటాన్ని అరికట్టడం, తప్పుడు లేబులింగ్ (misbranding)ను తొలగించడం, ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చూడటం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ఈ ప్రత్యేక తనిఖీ చర్యల లక్ష్యం.
ఈ ఆపరేషన్ లో సుగంధ ద్రవ్యాల సేకరణ, శుద్ధి, టోకు లేదా చిల్లర వ్యాపారంలో చురుకుగా ఉంటూనే, మానవ ఆరోగ్యానికి హాని కలిగించే అక్రమ చర్యలకు పాల్పడుతున్న 13 వాణిజ్య సంస్థలు, వ్యాపార కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. దాడుల్లో ప్రమాదకరమైన రసాయనాలు, హానికరమైన పదార్థాలు ఉన్నట్లు గుర్తించి, మొత్తం 25 టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు క్రిమినల్ కేసులు నమోదు చేయగా, ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్(Hyderabad Police Commissioner V.C. Sajjanar) మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసును పోలీసులు నమోదు చేశారని, కాటేదాన్‌కు చెందిన రాహుల్ భాటి, అలాగే బేగం బజార్‌కు చెందిన విశాల్ పన్వార్, దులిచంద్ కచ్చావార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం... సమగ్ర తనిఖీలలో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006' నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడం, తప్పుదోవ పట్టించే లేబులింగ్, ప్రాసెసింగ్ పద్ధతులు మాత్రమే కాకుండా, సులభంగా డబ్బు సంపాదించేందుకు అధిక ధరకు విక్రయించే మసాలా దినుసులలో అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పదార్థాలను కలిపే చర్యలు కూడా వెలుగుచూశాయని అన్నారు.
ఆహారంలో సింథటిక్ రంగులు (ఆరెంజ్, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో సహా) హానికరమైన రసాయనాల విస్తృత వినియోగాన్ని పోలీసులు గుర్తించారు. వీటితో పాటు వస్త్రాలకు వాడే రంగులు, పారిశ్రామిక స్థాయి శాశ్వత రంగులు, షైనింగ్ పౌడర్ (టాల్కమ్ పౌడర్), రైస్ బ్రాన్ ఆయిల్ వంటి ప్రమాదకరమైన, విషపూరిత పదార్థాలను కూడా వారు కనుగొన్నామని సజ్జనార్ పేర్కొన్నారు.






