4 August, 2026 | 3:49 PM

ఏటీసీ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

04-08-2026 02:34 PM

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి రూ.42 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణ పనులకు భూమిపూజ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా గ్రామీణ యువత పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కల్పించబడుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను యువత నేర్చుకోవడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయన్నారు. అలాగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం వల్ల క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, ఇంటర్న్‌షిప్‌ల అవకాశాలు కూడా పెరుగుతాయి. తెలంగాణ యువతకు నైపుణ్యం, ఉపాధి, అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి జిల్లాను అభివృద్ధి కేంద్రంగా, ప్రతి యువకుడిని దేశ నిర్మాణంలో భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని మంత్రి వివేక్ తెలిపారు.