4 August, 2026 | 4:03 PM

కొండాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

04-08-2026 02:42 PM

తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష: సర్పంచ్ గౌతమి ప్రశాంత్

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వంకాయల గౌతమి ప్రశాంత్, ఏఎన్‌ఎం సుష్మ, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి మాట్లాడుతూ... తల్లిపాలు నవజాత శిశువులకు అమృతంతో సమానమని తెలిపారు. బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే ముర్రుపాలు తొలి టీకాలా పనిచేస్తాయని, పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు.తల్లిపాల వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, భవిష్యత్తులో అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వివరించారు. తల్లిపాలను ప్రోత్సహించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.