భవన నిర్మాణ కార్మికుల నిధులను ప్రైవేట్‌కు కట్టబెట్టడం దుర్మార్గం
సీఐటీయూ
జూబ్లీహిల్స్, జూలై 6 (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని.. వెల్ఫేర్ బోర్డు నుంచే సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జూబ్లీహిల్స్ జోన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు ఖైరతాబాద్ మండల ఆఫీసులో వినతి పత్రాన్ని సమర్పించారు. ఎంఆర్‌ఓ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో అజహరుద్దీన్కు కార్మిక సంఘాల నాయకులు తమ 10 ముఖ్యమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహజ మరణానికి ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలని, పెండింగ్ క్లెయిమ్స్కు వెంటనే నిధులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంఘాల నాయకులు టి. సాయి శేషగిరిరావు,జూబ్లీహిల్స్ జోన్ సిఐటియు నాయకులు జాకటి స్వామి మాట్లాడుతూ.. 2009 నుంచి 2025 వరకు దాదాపు 28 లక్షల 50 వేల మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.
అయితే ప్రభుత్వం జీవో నెంబర్ 12 ద్వారా ప్రభుత్వ స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టి, బోర్డులోని 346 కోట్ల రూపాయలను అప్పనంగా అప్పగించిందని మండిపడ్డారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ కంపెనీలు ఖర్చు పెట్టింది కేవలం 140 కోట్లు మాత్రమేనన్నారు. మిగిలిన 200 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీల ఖాతాల్లోనే మిగిలిపోయాయని ఆరోపించారు. వెంటనే జీవో 12ను రద్దు చేయాలన్నారు.
జూలై నెలతో ముగియనున్న సీఎస్‌ఈ సంస్థ హెల్త్ టెస్టుల కాంట్రాక్టును మళ్లీ పొడిగించకుండా, ఆ విధులను ప్రభుత్వమే నిర్వహించాలని నాయకులు డిమాండ్ చేశారు.కార్మికులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని, రెన్యువల్ కాకుండా ఆగిపోయిన 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కార్డులను వెంటనే పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్కు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు సోమేశ్, మోతీ నగర్ కార్మిక సంక్షేమ సంఘం నాయకులు హనుమేష్, లియాఖత్ అలీ, సిఐటియు నాయకులు దిలీప్, సికిందర్, శివ శరణప్ప తదితరులు పాల్గొన్నారు.






