05-12-2024 09:52:11 AM
హైదరాబాద్: ఫోన్ టాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకాడుతున్నారు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పైనే మళ్ళీ ఉల్టా కేసు బనాయించారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుతామంటూ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారని సూచించారు. ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం? రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా? ప్రశ్నించారు. రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్న హరీశ్ రావు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మా నాయకులపై కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదన్నారు. ప్రజాకేత్రంలో నిలదీస్తూనే ఉంటాం, రేవంత్ రెడ్డి వెంటపడుతూనే ఉంటాం అని హరీశ్ పేర్కొన్నారు.
పోలీసు అధికారిని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో తీవ్ర వాగ్వాదం జరగడంతో స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కేఎం రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ బీ శివధర్ రెడ్డిలపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర స్టేషన్ నుంచి వెళ్లిపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.