calender_icon.png 14 September, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంపించిన భూమి

05-12-2024 02:00:22 AM

  1. పలు జిల్లాల్లో సెకన్ల పాటు ప్రకంపనలు
  2. ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు
  3. ఇళ్లల్లో పడిపోయిన వస్తువులు

* రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7:27 గంటలకు వచ్చిన భూప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఎవరి దినచర్యలో వారు ఉంటున్న సమయంలో ఒక్కసారిగా తెలియని అలజడి.. కొందరికి కళ్లు తిరిగినట్లు అనిపిస్తే, ఇంకొందరికి కళ్ల ముందే ఉన్న వస్తువులు కదలడం కనిపించి షాకయ్యారు.

ఇంట్లో అప్పుడప్పుడే నిద్ర లేస్తుండగా మంచం కదిలినట్లుగా అనిపించడం, కుర్చీలు, ఇంట్లోని వస్తువులు కింద పడటం చూసిన జనం ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. చుట్టూ ఉన్న ఇళ్లలోనూ జరగడంతో కొద్దిసేపటి తర్వాత భూప్రకంనలు వచ్చినట్లుగా తెలుసుకున్నారు. పలుచోట్ల ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. భూమి కంపిచిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా దర్శనమిచ్చాయి. 

హైదరాబాద్/మహబూబాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా బుధవారం భూప్రకంపనలు వచ్చినట్లు విపత్తు శాఖ అధికారులు గుర్తించారు. 5.3 తీవ్రతతో భూమి కంపించింది. ఉదయం 7.27 గంటలకు మేడారం సమ్మక్క, సారక్క ఆలయం ప్రకంపనలతో ఒక్కసారిగా ఊగిపోయింది. అక్కడే ఉన్న అర్చకుడు, ఓ భక్తురాలికి ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో..

జనగామ, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదయం సుమా రు 7:27 నిమిషాలకు భూప్రకంనలు వచ్చా యి. జనగామ జిల్లా కేంద్రంతో పాటు బచ్చన్నపేట, లింగాలఘణపురం మండలాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, మహాముత్తారం, కాటారం మహదేవ్‌పూర్, పలిమె ల, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాలు, ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, కాటారం, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మరిపెడ, కొత్తగూడ, గంగారం మండలాలు, వరంగల్‌లోని కరీమాబాద్, రంగశాయిపేట, వరంగల్, శివనగర్, కాశిబుగ్గ, దేశాయిపేట, చార్‌బౌళి ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 

పెద్దపల్లి జిల్లాలో

పెద్దపల్లి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో ఐదారు సెకన్ల పాటు భూ మి కంపించింది. జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని, మంథని ప్రాంతాల్లో భూమి కంపించింది. రామగుండం భూకంపం అని తెలియక ప్రజలు సాధారణంగా భావించారు. రోజూ బొగ్గు ఉత్పత్తి సమయంలో బ్లాస్టింగ్‌లు చేపడుతుంటారు. బ్లాస్టింగ్‌లకు గోదావరిఖనిలోని నివాస గృహాలు అదలడం నిత్యకృత్యంగా మారింది. బుధవారం కూడా గోదావరిఖనిలో పలు ఇళ్లు కదలడంతో ఓసీపీలోని బ్లాస్టింగ్‌లు కావచ్చని ప్రజలు భావించారు. ఆ తర్వాత భూకంపం వచ్చిందని తెలిసి విస్తుపోయారు.

నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో

సిద్దిపేట/కామారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని నిజామాబాద్, ఆర్మూర్, బాల్కోం డ, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, పిట్లం మండలాల్లో భూమి కంపించింది. సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్ ప్రాంతంలో స్పల్పంగా భూమి కంపించింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీనగర్ కాలనీ, గాంధీ చౌక్ తదితర కాలనీలలో భూకంపం వచ్చింది. 

ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో

మంచిర్యాల/కుమ్రంభీం ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి మండలాలు, కాగజ్‌నగర్ పట్టణం కాపువాడలో భూమి కం పించింది. మంచిర్యాలతో పాటు పలు మండలాల్లో ప్రకంపనలు సంభవించాయి. 

హైదరాబాద్ నగరంలో.. 

హైదరాబాద్ సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్, గండిపేట, షాద్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహి ల్స్, బోరబండ, క ల్యాణ్‌నగర్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూ డ, కార్మికనగర్, అంబ ర్‌పేట ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3 గా నమోదై ఉంటుందని నేషనల్ జీయోగ్రాఫికల్ రిసెర్చ్ ఇనిస్టిస్ట్యూట్ సైంటి స్ట్ శేఖర్ అంచనా వేశారు. హైదరాబాద్‌లో వచ్చింది భూకంపం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ సెస్మోలాజికల్ జోన్ ఉన్నందున ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. 

చెట్లు కూలడానికి భూకంపానికి సంబంధం లేదు

మహబూబాబాద్  కలెక్టర్ దివాకర్ టీఎస్ 

మహబూబాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): సెప్టెంబర్ 4న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నోడు కారణంగా వేలాది చెట్లు నేలమట్టం కావడానికి, బుధవారం వచ్చిన భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని మహబూబాబాద్ కలెక్టర్ దివాకర్ టీఎస్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. అనంతరం మేడారంలోని అమ్మవార్ల పూజారులతో ప్రత్యేక సమావేశమై మాట్లాడారు.

భూమిలో జరిగిన కొన్ని చర్యల వలన భూకంపం వస్తుందని, భూమిపైన జరిగిన కొన్ని చర్యల వలన చెట్లు కూలిపోతాయని తెలిపారు. బుధవారం ఉదయం భూమి కంపించడంతో తాను సైతం తన ఇంటి నుంచి బయటకు వచ్చానని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31న టోర్నొడో కారణంగా ములుగు అటవీ ప్రాంతంలో 85 వేల చెట్లు కూలాయి. మళ్లీ ఆ ప్రాంతం కేంద్రంగానే భూకంపం సంభవించింది. టోర్నొడో కారణంగా చెట్లు కూలిపోయిన మూడు నెలల్లోనే భూకంపం రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.