calender_icon.png 17 June, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి: హరీష్ రావు

16-06-2025 08:13:23 PM

హైదరాబాద్: ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతి నిరోధక బ్యూరో విచారణ ముగిసింది. ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో మరోసారి విచారణకు హాజరైన అనంతరం, తెలంగాణ భవన్‌కి చేరుకున్న కేటీఆర్ కు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేటీఆర్ పై 14 కేసులు పెట్టారని, రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.

మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన నిన్ను ఏం చేయాలి రేవంత్ రెడ్డి? హరీశ్ రావు ప్రశ్నించారు. కేటీఆర్ ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ ఫార్ములా రేసింగ్ కోసం పోటీపడుతుంటే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్‌కు ఫార్ములా ఈ రేసును తీసుకువచ్చారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి మాత్రం ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించమని తేల్చి చెబితే తెలంగాణలో నిర్వహించి ఈ దేశ, రాష్ట్ర పరువు తీశాడని విరుచుకుపడ్డారు. అందరూ కావాలన్న ఈ కార్ రేసింగ్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చి రాష్ట్ర గౌరవం పెంచిందని అభిప్రాయపడ్డారు.

ఎవరూ ముందుకు రాని అందాల పోటీలు నిర్వహించి పరువు తీసింది రేవంత్ రెడ్డి కాదా.. అని అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి కేటీఆర్ పై తప్పుడు కేసులు పెట్టి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో తుమ్మినా, దగ్గినా కేసులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కమీషన్లను ఎత్తిచూపితే కేసులు, లఘుచర్ల రైతులకు బేడీలేస్తే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు. లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అండ ఉన్న కేటీఆర్ ని ముట్టుకుంటే భస్మం అయిపోతారు, తస్మాత్ జాగ్రత్త అని హరీశ్ హెచ్చరించారు.