హరీశ్‌రావు రాజీనామా డ్రామా

27-04-2024 02:24:50 AM

l స్పీకర్ ఫార్మాట్‌లో ఇవ్వకుండా నాటకాలు 

l దొంగ లేఖలు ఎందుకు?: మంత్రి కోమటిరెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 26( విజయక్రాంతి ): రాజీనామా డ్రామాతో హరీశ్‌రావు మరోసారి ప్రజలు మోసం చేయాలని చూస్తున్నా రని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాజీనామా లేఖతో సవాల్ విసిరానని గొప్పలు చెప్పుకుంటున్న హరీశ్‌రావు.. ఆ పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్‌లో ఎందుకివ్వలేదని మంత్రి నిలదీశారు. హరీశ్‌రావు నాటకాల రాయుడని, మళ్లీ జోకర్‌లా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రాజీనామా అంటే ఒక్కటే లైన్ ఉంటుందన్నారు. శుక్రవారం తన నివాసంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె లేదని అమాయకులను చంపిన వ్యక్తి హరీశ్‌రావు అని, ఇప్పు డు దొంగ రాజీనామా లేఖలు ఎందుకు ఇస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించడం బీఆర్‌ఎస్ నేతలు మానుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ గెలిస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. తానే సీఎం పదవీ తీసుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన విధ్వంసాన్ని తమ ప్రభుత్వం చక్కపెడుతోందన్నారు. అధికారం లో ఉన్నప్పుడు ఫామ్‌హౌస్ నుంచి బయటకి రాని కేసీఆర్, ఇప్పుడు కర్రపట్టుకుని బయటకు వస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. మెదక్‌లో బీఆర్‌ఎస్‌కు కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 40 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి వివరించారు. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు.