18-10-2025 08:35:59 PM
రైతులతో సమన్వయంగా ఉండాలి..
జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): హార్వెస్టర్ వాహనదారులు నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో హార్వెస్టర్ యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. వరి కోతలు కోసేముందు హార్వెస్టర్ కు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలన్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు పైగా వరి సాగు జరుగుతుందని, రైతులకు వ్యవసాయ కూలీలు హార్వెస్టర్ వాహనదారుల సహకారం అత్యంత అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. వరి కోత సమయాల్లో రైతులకు కనీస మద్దతు ధర లభించేందుకు హార్వెస్టర్ వాహనదారులు కొన్ని నియమాలు, ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు.
జిల్లా రెవెన్యూ అధికారి మధు మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలందరి సహకారం రైతులకు ఎల్లప్పుడూ ఉంటుందని, హార్వెస్టర్ వాహనదారులు కూడా రైతులతో సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు. అపక్వ పంటలను కోయకుండా, సమయానుసారంగా కోత పనులు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జె. శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(టెక్నికల్) ప్రసన్న, సుధారాణి, అమర్ ప్రసాద్, మున్సిపల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రవీణ్, నరేంద్ర, కార్తీక్ తదితర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.