18-10-2025 08:35:26 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలపై బైకు నడుపుతూ అదుపుతప్పి ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. చందాపూర్ గ్రామానికి చెందిన పైడి చిన్న గంగారెడ్డి (60) అనే వ్యక్తి మండల కేంద్రంలో పని ఉండడంతో గ్రామం నుంచి బైకుపై తాడ్వాయి గ్రామానికి బయలుదేరారు.
గ్రామ శివారులో రోడ్డుపై రైతులు మొక్కజొన్న కుప్పలు ఆరబోశారు. మొక్కజొన్నలపై బైక్ నడుపుతూ వెళ్లి అదుపుతప్పి గంగారెడ్డి కింద పడిపోయాడు. దీంతో ఆయనకు తలకు, కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు
రోడ్డుపై నిర్లక్ష్యంగా మొక్కజొన్నలు ఆరబోయడంతోనే ప్రమాదం..
- రైతులు తమ మొక్కజొన్నలను రోడ్డుపై నిర్లక్ష్యంగా ఆరబోయడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు మొక్కజొన్నలను రోడ్డుపై ఆరబోయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మొక్కజొన్నలను రోడ్డుపై కుప్పలుగా పోయవద్దని. పోసిన వాటిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.