1 July, 2026 | 8:57 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

హృదయం చెక్కిన అక్షరాలు

10-03-2025 12:00 AM

మా పాదాలకు 

తొడిగిన చెప్పులు

కాలం చెల్లి 

అరుగుతూనే ఉన్నాయి!

మా ముందు తరాలకు

ఊతకర్రలు వారసత్వంగా

అందుతూనే ఉన్నాయి!

అభద్రతా భావంతో

కప్పుకున్న నల్లని కంబళిని

మా భుజాలు 

మోస్తూనే ఉన్నాయి!

దశాబ్దాలుగా నల్లని చీకటి

మా మురికివాడని

కబలిస్తూనే ఉంది.

తరాలు మారుతున్నా

మా చేతులకు తొడిగిన

బానిస సంకెళ్లు చూస్తూ

నట్టింట్లో చమురుదీపం

మినుకు మినుకుమంటూ వెలుగుతుంది.

తనకు తానుగా కాలిపోతూ

అందని చమురువైపు

దీనంగా చూస్తూ!

గడప లోపల నేల

చిత్తడి చిత్తడిగా మారుతుంది

వేదనతో ద్రవించే 

హృదయాన్ని

ఓదార్చ లేని 

కన్నీటి చెమ్మతో!

హృదయం కొత్తగా 

అక్షరాలు చెక్కుతుంది

మా పిల్లల చేతుల్లో

పలకా బలపం 

ఒదిగిపోతుంది.

ఇప్పుడిప్పుడే మా పేటలో

అక్షరాల వెలుగులు 

సరికొత్తగా ప్రసరిస్తున్నాయి.

చీకటి మెల్లిగా 

కనుమరుగవుతుంది.

మా చేతులను బంధించిన 

సంకెళ్లు తెగిపడుతున్నాయి

స్వేచ్చా పవనాలు 

వీస్తూ వుంటే!

- రాము కోలా