29-08-2025 05:42:09 AM
యాదాద్రి భువనగిరి(విజయక్రాంతి)/యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా యి. మూసి, బిక్కేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వలిగొండ మండలం సంగం బొల్లేపల్లి మధ్యగల లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భువనగిరి చౌటుప్పల్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. మూసీ నది రెండు వైపులా పోలీసు లు కాపలా ఉండి ఎవరిని కూడా అనుమతించడం లేదు.
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద వరద నీరు రోడ్ లెవెల్ పై నుండి భారీగా ప్రవహిస్తుండడంతో రాత్రి నుండి పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. భువనగిరి రహదారిపై లారీలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ఆర్టీసీ బస్సులను రెండు రోజుల నుండి నిలిపివేశారు. పోలీసులు ఎవర్ని కూడా అనుమతించడం లేదు. ఆలేరు వద్ద బిక్కీర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నడంతో దాదాపు 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జనగాం వెళ్లే ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి తిరిగి వెళ్తున్నారు. యాదగిరిగుట్ట మండలాల మధ్యగల అతిపెద్దదైన పొట్టిమర్రి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. సుమారు 300 మీటర్లు గల వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాజపేట మండలం కాల్వపల్లి నుంచి యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
10 సంవత్సరాల తర్వాత ఇంత భారీగా వాగు ప్రవహించడం మొదటిసారి అని స్థానికులు తెలుపుతున్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాలలోని పాలేరు వాగులో కిన్నెర ఉపేందర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పాలేరు వాగు దాటేందుకు ముగ్గురు యువకులు పందెం వేసుకున్నారు. దీంతో వాగు దాటేందుకు ఉపేందర్ ప్రయత్నించగా వరద పోటెత్తడంతో గల్లంతయ్యాడు.