29-08-2025 05:40:24 AM
పునరావాస కేంద్రాలకు 164 కుటుంబాలు
నిజామాబాద్(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బోధన్ మండ లం కండ్గావ్ నుంచి మహారాష్ర్టకు వెళ్లే మంజీరా వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంతెన పైనుంచి రాకపోకలు నిలిపివేశా రు. సిరికొండ, ధర్పల్లి, భీంగల్, ఇందల్వాయి మండలాల్లోని కొండాపూర్, తూంపల్లి, గడ్కోల్, ముషీర్ నగర్, హోన్నాజీపేట్, వాడి, నడిమితండా, బెజ్జోరా, సిర్నాపల్లి గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి.
ఈ ప్రాంతాలలో మూడు చెరువులు తెగిపోగా, సుమారు 12,413 ఎకరాలలో ఇసుక మేటలు వేశాయి. 13 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 29 చోట్ల ఆర్ అండ్ బీ రోడ్లకు నష్టం జరిగింది. 164 కుటుంబాలకు చెందిన 358 మందికి పునరావాసం కల్పించారు. వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని కాపాడారు. కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో భీంగల్ ఎక్సుజ్ కార్యాలయంలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడారు.
బెజ్జోర వద్ద ఆటోలో వెళ్తున్న ఆరుగురిని జేసీబీ సహాయంతో కాపాడారు. ఇందల్వాయి మండల దోన్కల్ లో ఫాంహౌ స్‌లో చిక్కుకున్న వ్యక్తిని, ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద 8 మందిని రక్షించారు. కామారెడ్డి మధ్య హైదరాబాద్‌కు వెళ్ళే మార్గంలో వరద నీటి ప్రవాహం వల్ల వాహనాలు ముందుకు వెళ్ళే పరిస్థితి లేక ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్, ముప్కాల్, బాల్కొండ ప్రాంతాల వద్ద నిరీక్షిస్తున్న లారీల డ్రైవర్లకు 600 ఫుడ్ ప్యాకెట్లను ఉచితంగా అందజేశారు.