26 August, 2026 | 4:11 PM

నగరంలో దంచికొట్టిన వాన

11-06-2024 10:22 PM

హైదరాబాద్: మహానగరంలో మంగళవారం ఓ మోస్తారుగా కురిసిన వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రహ దారులన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం సమయంలో చాలా చోట్ల చెట్లు నేలకొరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ తర్వాత విద్యుత్ సిబ్బంది రోడ్లకు అడ్డుగా ఉన్న విద్యు త్ సరఫరాకు ఆటంకంగా మారిన చెట్లను తొలగించి సరఫరాను పునరుద్దరించారు. భారీ వర్షం కారణంగా సబ్ స్టేషన్, ఇందిరానగర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచింది.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డిజిస్టార్ రెస్పాన్స్ బృందాలు రోడ్లపై నిలిచిన వరదనీరును తొలగించే చర్యలు చేపట్టారు. నగరంలో అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదీగూడ లో 6.5 సెం. మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కాప్రాలో 4.3 సెం.మీటర్లు, హయత్‌నగర్‌లో 3.5 సెం.మీటర్లు, లాలాపేటలో 2.3 సెం.మీటర్లు, ఉప్పల్ బండ్లగూడ లో 2.2 సెంటిమీటర్లు, రామాంతాపూర్‌లో 2.1 సెం. మీటర్లు, ఆనంద్‌బాగ్‌లో 1.9 సెంటి మీటర్లు, కుత్బుల్లాపూర్‌లో 1.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వరద నీరు తొలగించేందుకు డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.