పంట మార్పిడితోనే అధిక ఆదాయం
సిద్దిపేట రూరల్, జూలై 6: రైతులు వరి సాగుకే పరిమితం కాకుండా పంట మార్పిడి విధానాన్ని అనుసరిస్తే సాగు వ్యయం తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు రైతు వేదికలో సోమవారం సబ్సిడీపై ప్రత్తి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ లత రైతులకు విత్తనాలను అందజేశారు.
ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పంటల వైవిధ్యాన్ని పాటించాలని రైతులకు సూచించారు. గ్రామ సర్పంచ్ లత మాట్లాడుతూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అనుసరించి నాణ్యమైన విత్తనాలతో సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నరేష్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి,రాములు, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఐరెనీ అంజిరెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి,గ్రామ రైతులు పాల్గొన్నారు.






