ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, మే 11 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న 20 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన నేపథ్యంలో, అర్హులైన ఉద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్ణీత సమయంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బదిలీలు లేదా ప్రమోషన్ల కోసం ఎవరైనా తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో పాటు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబందించి 32 దరఖాస్తులు, డిపిఓ 5, డిడబ్ల్యుఓ 3, డిఆర్డిఏ 2, వివిధ శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులు రాగా మొత్తం 71 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డిసిఓ ప్రవీణ్ కుమార్, డిఎంహెచ్వో వెంకటరమణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






